పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్.. మిల్లర్లతో మంత్రి తుమ్మల చర్చలు సక్సెస్

పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్.. మిల్లర్లతో మంత్రి తుమ్మల చర్చలు సక్సెస్

హైదరాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్  అయింది. జిన్నింగ్‌‌  మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం సెక్రెటేరియెట్‌‌లో సీసీఐ సీఎండీ లలిత్  కుమార్  గుప్తా, జిన్నింగ్‌‌  మిల్లర్ల అసోసియేషన్‌‌  ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. మిల్లర్ల సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ.. సమ్మె పేరుతో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడం రైతులకు అన్యాయం చేయడమేనని మిల్లర్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే కొనుగోళ్లలో అడ్డంకులు వచ్చాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఒత్తిడి తీసుకువస్తోందని తెలిపారు. తేమ శాతం, కొనుగోలు పరిమితుల వంటి కఠిన నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించారు. బుధవారం నుంచే పత్తి కొనుగోళ్లు యథాతథంగా సాగాలని, నోటిఫై చేసిన అన్ని జిన్నింగ్‌‌  మిల్లులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. పోరాటం కేంద్రంతో చేయాలే తప్ప రైతులను ఇబ్బందికి గురిచేయడం తగదని సూచించారు. సమస్యలపై నివేదిక సిద్ధం చేసి వెంటనే కేంద్ర జౌళి శాఖకు పంపాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌‌ను మంత్రి ఆదేశించారు.

రైతుల కోసం మరో రెండు కీలక నిర్ణయాలు
రైతులపై భారం తగ్గించేందుకు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని 18 నుంచి 25 క్వింటాళ్లకు పెంచామని, సోయాబీన్  కొనుగోలు పరిమితిని కూడా ఎకరానికి 6.72 నుంచి 10 క్వింటాళ్లకు పెంచేలా మార్క్‌‌ఫెడ్‌‌కు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. కౌలు రైతులకు ఇబ్బంది లేకుండా ఆధార్‌‌ అథెంటికేషన్‌‌తో పాటు మొబైల్‌‌  ఓటీపీ ఆధారంగా కూడా కొనుగోళ్లు జరపాలని అధికారులకు ఆయన సూచించారు.