మన స్టేట్ నుండే పత్తి ఎక్కువ కొన్నరు

మన స్టేట్ నుండే పత్తి ఎక్కువ కొన్నరు

మహబూబ్‌‌నగర్, వెలుగు:

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఏ) ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్లు చేసింది. ఇప్పటి వరకు కోటి క్వింటాళ్లకు పైగా పత్తిని సేకరించడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రూ.2,100 కోట్ల టర్నోవర్‌‌తో పాలమూరు జోన్‌‌ దేశంలోనే టాప్‌‌లో ఉండగా.. వరంగల్ రూ.2వేల కోట్లు, ఆదిలాబాద్ రూ.1400 కోట్ల టర్నోవర్ సాధించాయి. అలాగే ఈ ఏడాది అత్యధిక పత్తి కొనుగోళ్లతో రాష్ట్రానికి రూ.500 కోట్లకుపైగా ఆదాయం సమకురింది.

మద్దతు ధరకు సేకరణ

రాష్ట్రం గతంలో ఆదిలాబాద్, వరంగల్ జోన్లలో మాత్రమే సీసీఏ పాయింట్లు ఉండేవి. పాలమూరు ప్రాంత రైతుల ఇబ్బందులు గమనించిన మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి 2017లో అప్పటి కేంద్ర టెక్స్​టైల్​శాఖ మంత్రి స్మృతి ఇరానిని కోరడతంతో ఇక్కడ సీసీఏ బ్రాంచ్‌‌ ఏర్పాటు చేశారు. ప్రారంభించిన 2017––18 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 407 కోట్లు తరువాత 2018-–19లో రూ.760 కోట్ల టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా పత్తి కొనుగోళ్లు చేపట్టిన జోన్‌‌గా పాలమూరు ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1లక్షా 30వేల మంది రైతుల వద్ద సుమారు 43 లక్షల క్వింటాళ్ల పత్తి కొన్నారు. డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు. అమ్మిన రైతుకు నాలుగైదు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తుండటంతో రైతులు పత్తి అమ్మకాలపై ఉత్సాహం చూపుతున్నారు. మహబూబ్‌‌నగర్ జిల్లాలో చేపట్టిన కొనుగోళ్ల వల్ల మార్కెటింగ్ ఫీజు రూపేణా20 కోట్లు, స్టేట్ జీఎస్‌‌టీ రూ.75 కోట్లు, టీడీఎస్ 10 కోట్లు, బీమా కంపెనీలకు రూ.4 కోట్లు, జిన్నింగ్ మిల్లులకు అదనంగా 90 కోట్ల ఆదాయం వచ్చింది.  అలాగే ఈ ఏడాది కేంద్రం పత్తికి క్వింటాల్‌‌కు 5,550  మద్దతు ధర ప్రకటించింది. బయట మార్కెట్‌‌లో తక్కువ ధర ఉండడంతో సీసీఏ గుర్తించిన జిన్నింగ్‌‌ మిల్లులకు రైతులు బారులు తీరుతున్నారు.