
- నిందితుడి అరెస్టు.. మూడు సెల్ ఫోన్లు, బైక్, ఆటో సీజ్ చేసిన పొలీసులు
కామేపల్లి, వెలుగు: అమ్మాయిల పేర్ల మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి లక్షల్లో వసూలు చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారేపల్లి రూరల్ సీఐ తిరుపతి రెడ్డి, ఎస్ సాయికుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన గడబోయిన హరీశ్ (30) గ్రామంలో వాటర్ ప్లాంట్ నడుపుతున్నాడు. కొంతకాలంగా తన మొబైల్ నుంచి నకిలీ యూజర్ ఐడీలు క్రియేట్ చేసి, ఇన్ స్టాగ్రామ్‌లో అమ్మాయిల ఫోటోలు డీపీలుగా పెట్టేవాడు.
సోషల్ మీడియా ద్వారా తనకు ఎవరూ లేరు అంటూ పై చదువులకు, ఫీజులకు డబ్బు సాయం చేయాలంటూ అభ్యర్థిస్తాడు. వేరే వాళ్ల బ్యాంక్ అకౌంట్ ఖాతాలకు వారికి తెలియకుండా తన మొబైల్ నంబర్ యాడ్ చేసుకుంటాడు. ప్రతి వారం ఐడీలు మారుస్తూ అమ్మాయిల వాయిస్ తో రికార్డులు పంపుతాడు. ఇలా 200 మంది పేరుతో ఫేక్ యూజర్ ఐడీలు క్రియేట్ చేసి రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో 215 మంది వరకు సుమారు రూ. 4 లక్షలు వరకు పంపారు. వీటిని హరీశ్ జల్సాలకు వాడుకున్నాడు. నిందితుడి నుంచి మూడు సెల్ ఫోన్లు, పల్సర్ బైక్, ట్రాలీ ఆటో సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.