జనగామలో అవిశ్వాసంపై తగ్గని కౌన్సిలర్లు

జనగామలో అవిశ్వాసంపై తగ్గని కౌన్సిలర్లు
  • జనగామలో అవిశ్వాసంపై తగ్గుతలేరు
  • కేటీఆర్​ చెప్పినా డోంట్​కేర్​
  • అవసరమైతే రాజీనామాకు సిద్ధమంటున్న అసమ్మతి వర్గం  
  • వైస్​ చైర్మన్​, ఫ్లోర్​ లీడర్లను తొలగిస్తామన్న ఎమ్మెల్యే 

జనగామ, వెలుగు : జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం విషయంలో తగ్గేదేలేదని అధికార పార్టీ అసమ్మతి కౌన్సిలర్లు తేల్చి చెబుతున్నారు. ‘మా కష్టాలు మాకున్నయ్​..అధిష్టానం ఊరుకోమంటే ఊరుకుంటామా..మా బాధలు తీర్చాలె’ అని అంటున్నారు. పాలకవర్గం ఏర్పాటై మూడేండ్లవుతున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన11 మంది కౌన్సిలర్లు భువనగిరిలో అసమ్మతి క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడం హాట్​టాపిక్​ గా మారింది. మరో వైపు మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​అవిశ్వాసాలను ఎంకరేజ్​చేయొద్దని మున్సిపల్​కమిషనర్లకు మెసేజ్​లు పెట్టగా తాము ఎవరిమాటా వినమని అసమ్మతి వర్గం తేల్చి చెప్పింది. అవసరమైతే రాజీనామాలకైనా సిద్ధమంటూ కౌన్సిలర్లు అల్టిమేటం జారీ చేయడంతో జనగామ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం చైర్మన్​సీటు కోసం 19వ వార్డు కౌన్సిలర్​బండ పద్మ పోటీ పడుతున్నారు. త్వరలో అవిశ్వాస నోటీసు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. 

చైర్మన్​పీఠంపై అసమ్మతి వర్గం ధీమా

మున్సిపల్​పరిధిలో 30 మంది కౌన్సిలర్లుండగా బీఆర్ఎస్​ కౌన్సిలర్లు 18 మంది, కాంగ్రెస్​ నుంచి 8, బీజేపీ నుంచి నలుగురు ఉన్నారు. కాగా, అసమ్మతి క్యాంపులో బీఆర్ఎస్​కు చెందిన 11 మంది ఉన్నారు. చైర్​పర్సన్ పోకల జమున, వైస్​ చైర్మన్ మేకల రాంప్రసాద్, ఫ్లోర్​ లీడర్​మారబోయిన పాండు మినహా మిగిలిన వారి మద్దతు తమకే ఉందని ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్​, బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్​చైర్మన్​, వైస్​ చైర్మన్​ పీఠాలను దక్కించుకోవాలనే ఎత్తుగడలో ఉన్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఒక్కటిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాసంపై నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునేది లేదనే చెబుతున్నారు. అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు, సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రంగంలోకి దిగారు. వైస్​ చైర్మన్ మేకల రాంప్రసాద్, ఫ్లోర్ ​లీడర్ ​మారబోయిన పాండులను తొలగిస్తామని..చైర్మన్​విషయంలో కొంతకాలం వేచి చూడాలని ఎమ్మెల్యే బీఆర్ఎస్ టౌన్​ ప్రెసిడెంట్​, కౌన్సిలర్​ తాళ్ల సురేశ్​రెడ్డి ద్వారా కబురు పంపారు. పాలకవర్గం ఏర్పాటై మూడేండ్లయిన సందర్భంగా సురేశ్​రెడ్డి అసమ్మతి వర్గ క్యాంపుకు వెళ్లి కేక్​ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని వివరించగా వైస్​ చైర్మన్, ఫ్లోర్​లీడర్ల తొలగింపు తర్వాత తాము ఆలోచిస్తామని సమాధానమిచ్చారు.