లైవ్ అప్ డేట్స్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రిజల్ట్స్

లైవ్ అప్ డేట్స్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రిజల్ట్స్

గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో  156 సీట్లను గెలుచుకుని బీజేపీ చరిత్ర సృష్టించగా,  హిమాచల్ లో 40 సీట్లు సాధించి  కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టనుంది. 

 

ముగిసిన ఓట్ల లెక్కింపు

గుజరాత్ లో బీజేపీ 156 సీట్లు గెలుచుకుని వరుసగా ఏడో సారి అధికారాన్ని  చేపట్టనుంది. గుజరాత్ మళ్లీ బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించినా.. అంచనాలను మించి మరీ బీజేపీ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా, ఆప్ 5 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇతరులు నాలుగు స్థానల్లో గెలుపొందారు.

హిమాచల్ ప్రజలు సంప్రాదాయానికే ఓటు వేశారు. 1985 నుంచి ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ లకు ఒక్కోసారి అధికారాన్ని కట్టబెడుతూ వస్తున్నారు.  ఇప్పుడు కూడా దీనినే కొనసాగించారు.  తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు రాగా, బీజేపీకి 25, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. 

 

సీఎం పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్

హిమాచల్‌ప్రదేశ్ లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 28, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. దీంతో  హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌కు అందజేశారు. హిమాచల్ లో 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. 

ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన  రఘు శర్మ


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ  ఆ రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ రఘు శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన  రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. "రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనూహ్య ఓటమికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాను. పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నా రాజీనామాను దయచేసి ఆమోదించండి"  అని లేఖలో పేర్కొన్నారు.

 

ఈ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఎంతో నేర్చుకున్నాం : అరవింద్ కేజ్రీవాల్ 

‘‘గుజరాత్ ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. వాళ్లకు రుణపడి ఉంటా. ఈ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఎంతో నేర్చుకున్నాం’’ అని చెప్పారు. ఇప్పుడు ఆప్ ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించిందన్నారు.  ఆప్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు కృషిచేసిన వారందరికీ కేజ్రీవాల్ ధన్యవాదాలు  తెలిపారు. ‘‘ ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. మనం ప్రజా సేవ చేయడానికి సదా సిద్ధంగా ఉండాలి.. ఆపదలో , కష్టాల్లో ఉన్నవారికి సాయపడుతూ ముందుకు సాగండి.. ఓట్లు కూడా మనకు వచ్చి తీరుతాయి’’

 

క్రికెటర్ జడేజా భార్య రివాబా ఘన విజయం


జామ్ నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘన విజయం సాధించారు. 

 

EVM ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ గాంధీధామ్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి భరత్‌ భాయ్ వెల్జీభాయ్ సోలంకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మెడుకు కండువా బిగించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అక్కడున్న పోలీసులు, ఇతర సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాధ్వి  ఓటమి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాధ్వి  ఓటమి పాలయ్యారు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి అయర్ ములుభాయ్ హర్దాస్‌భాయ్ బేరా పై 19,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.  ఇసుదాన్ గధ్వి 53,583 ఓట్లు రాగా,  బేరాకు 71,345 ఓట్లు వచ్చాయి.  ఇసుదన్ గాధ్వి మొదట దూరదర్శన్‌లో పనిచేశారు. తర్వాత జర్నలిస్టుగా మరారు. 2021 లో ఆయన  ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరారు. 

 

రివాబా జడేజా రోడ్‌షో

గుజరాత్ లోని జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన  ప్రముఖ క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా విజయం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం ఆమె ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై 50,456 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  దీంతో ఆమె తన భర్త రవీంద్ర జడేజాతో కలిసి జామ్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. 

ఈనెల 12న గుజరాత్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు


గుజరాత్ లో ఏడోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు. 12న మధ్యాహ్నం 2 గంటలకు ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. గట్లోదియా  నుంచి భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. 

గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ లో కాంగ్రెస్ 

గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ లో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడం లాంఛనమే కానుంది. ఇప్పటివరకు హిమాచల్ లో 39 స్థానల్లో కాంగ్రెస్ గెలవగా, బీజేపీ 26 స్థానల్లో గెలిచింది. ఆప్  హిమాచల్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించడం లేదు.  అటు గుజరాత్ లో బీజేపీ 182 స్థానాలకు 122 స్థానల్లో గెలిచింది. కాంగ్రెస్ 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 

 

హిమాచల్ లో మొదలైన క్యాంప్ రాజకీయాలు

హిమాచల్ ప్రదేశ్ లో  కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 35  దాటింది. 40 సీట్లల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 25  సీట్లల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ముందు జాగ్రత్తగా ముందంజలో ఉన్న అభ్యర్థులను రాజస్థాన్ లేదా రాయ్ పూర్  రిసార్ట్ కు తరలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

 ఈ నెల 12న గుజరాత్ లో ప్రభుత్వ ఏర్పాటు

గుజరాత్ లో ఈ నెల 12న ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ స్టేట్ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. 12న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారానికి పీఎం మోడీ, అమిత్ షా కూడా హాజరవుతారని చెప్పారు.

హిమాచల్ లో అధికారం దిశగా కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం దిశగా వెళ్తోంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 35 ను దాటింది. 39 సీట్లల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 26  సీట్లల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

 గుజరాత్ ఫలితాలు షాక్ కు గురిచేశాయి

 గుజరాత్  ఎన్నికల్లో కాంగ్రెస్ శక్తివంచనా లేకుండా కష్టపడిందని.. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ జగదీశ్ ఠాకూర్ తెలిపారు. మళ్లీ బీజేపీకే అధికారం ఇవ్వాలన్న ప్రజల తీర్పు నిజంగా ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ ఫలితాలు తనను షాక్ కు గురి చేశాయని చెప్పారు. భారీగా ఓటు షేరును కోల్పోవడంపై చర్చిస్తామన్నారు.

గుజరాత్, హిమాచల్ సీఎంలు విజయం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం భూపేంద్ర పటేల్‌ విజయం సాధించారు. గట్లోదియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. హిమాచల్ సీఎం  జైరాం ఠాకూర్‌ సెరాజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

 ముందంజలో జడేజా భార్య

గుజరాత్ లోని జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య  రవీబా  ఆధిక్యంలో ఉన్నారు.

 హిమాచల్ లో బోణీ కొట్టిన బీజేపీ

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టింది. సెరాజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం జైరాం ఠాకూర్‌ విజయం సాధించారు. ఇక  బీజేపీ, 30, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

 సంబరాల్లో బీజేపీ కార్యకర్తలు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 150 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో పార్టీ కార్యకర్తలు  ఆనందంలో మునిగి తేలుతున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం 182 స్థానాలకు గానూ 150 కు పైగా స్థానాల్లో బీజేపీ,  కాంగ్రెస్‌ 23, ఆప్‌ 5, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో  ఉన్నాయి

 

గుజరాత్ లో ఏడోసారి అధికారం దిశగా బీజేపీ

గుజరాత్ లో మరోసారి బీజేపీ జెండా  ఎగురవేయబోతుంది. 150 కు పైగా స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్  22, ఆప్ 8స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ సీట్లకు  ఆప్ గండి కొట్టినట్లు కనిపిస్తోంది. గుజరాత్ బీజేపీ సీఎం క్యాండిడేట్ భూపేంద్ర పటేల్‌ 23వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ,కాంగ్రెస్ హోరాహోరీ

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.బీజేపీ 31, కాంగ్రెస్ 33,ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆప్ ఖాతా తెరవలేదు

 

 వెనుకంజలో రవీంద్ర జడేజా భార్య

 గుజరాత్ లో ఎన్నికల  కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జామ్‌నగర్‌ ఉత్తరం స్థానంలో రవీంద్ర జడేజా భార్య రివాబా (బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.  విరంగాం స్థానంలో హార్థిక్‌ పటేల్‌ ముందంజలో ఉన్నారు.

ముందంజలో హార్ధిక్ పటేల్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ 135 నుంచి 145 కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని బీజేపీ అభ్యర్థి హార్థిక్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గెలుచుకున్న స్థానాల కంటే ఈ సారి బీజేపీ మరిన్ని ఎక్కువ స్థానాలు తన ఖాతాలో వేసుకుంటుందన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిస్సందేహంగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

ఆధిక్యంలో డింపుల్ యాదవ్

ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్  16,933 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు, కౌంటింగ్ కొనసాగుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ చూపలేకపోయింది. హిమాచల్ లో సీఎం జైరాం ఠాకూర్ ముందజలో ఉన్నారు. ఉదయం 9.20 నిమిషాలకు వరకు గుజరాత్ లో బీజేపీ 140, కాంగ్రెస్ 25, ఆప్ 6 స్థానాలను దక్కించుకున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ 29, కాంగ్రెస్ 32 స్థానాలను గెలుచుకున్నాయి. 

బీజేపీ దూకుడు

గుజరాత్ లో ఇప్పటివరకు బీజేపీ117 కాంగ్రెస్ 46, ఆప్ 5 స్థానాలల్లో ముందంజలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో చూసుకుంటే బీజేపీ 26, కాంగ్రెస్ 29 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. 

ప్రారంభమైన కౌంటింగ్..

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. 11 గంటల వరకు ఫలితాలపై స్పష్టత రానుంది.