రేపే నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు

రేపే నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
  • కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం కరోనా నిబంధనల మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ,  అస్సాం రాష్ట్రాలతోపాటు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ మొదలు అవుతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. 
కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్‌కు అనుమతి
కౌంటింగ్ హాలులోకి వెళ్లాలంటే కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు పోలింగ్ ఏజెంట్లు  కాండిడేట్ల ను హాల్ లోకి అనుమతించాలంటే 48 గంటల ముందు చేయించిన ఆర్టీపిసిఆర్ టెస్ట్ లేదా రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్ ఉండాలని అధికారులు ప్రకటించారు. దీంతో కౌంటింగ్ సమయానికి మొదలుకావడం అనుమానంగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కౌంటింగ్ పాసులు తీసుకున్న వారు చాలా ముందుగా వచ్చి కోవిడ్ టెస్టు ఫలితం చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఆలస్యం జరిగితే దాని ప్రభావం కౌంటింగ్ మీద పడే పరిస్థితి కనిపిస్తోంది. 
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
కరోనా సునామీలా విరుచుకుపడుతున్న నేపధ్యంలో కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య ఓట్ల లెక్కింపు చేపడుతున్న అధికారులు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు సైతం కరోనా కట్టడిలో చాలా తీవ్రంగా స్పందిస్తున్న నేపధ్యంలో ఆంక్షల గీత దాటితే ఏం చేయబోతారన్నది అర్థం కాని పరిస్థితి.
ఉదయం 10 గంటలకల్లా వేవ్ 
ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైనా 10 గంటలకంతా వేవ్ బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఫలితాలు ఏ పార్టీ వైపు ఉండబోతున్నాయనేది ఒక అంచనా వేసే అవకాశం కలుగుతుంది. ఓట్ల మధ్య వ్యత్యాసం పెద్దగా లేకపోతే మాత్రం లెక్కింపు ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ నేపధ్యంలో హోరా హోరీగా పోరు జరిగిన నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కావడానికి సాయంత్రం లేదా చీకటిపడే అవకాశాలు లేకపోలేదు. 
వెబ్ సైట్ లో ఎన్నికల ఫలితాలు
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఓట్ల లెక్కింపును  కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో అధికారికంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనుంది. results.evi.gov.in లో ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అప్డేట్ చేస్తుంది. 

కేరళ మొత్తం సీట్లు:140
కేరళ మెజారిటీ మార్క్ :71

వెస్ట్ బెంగాల్ మొత్తం సీట్లు:294( 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి)
మెజారిటీ మార్క్: 148

అస్సాం మొత్తం స్థానాలు :126 
మెజారిటీ మార్క్ :64

తమిళనాడు మొత్తం స్థానాలు :234
మెజారిటీ మార్క్: 118

పుదుచ్చేరి మొత్తం స్థానాలు:30(3 నామినేటెట్ మెంబర్స్ )
మెజారిటీ మార్క్: 17