గుజరాత్, హిమాచల్​ లో ప్రారంభమైన కౌంటింగ్

గుజరాత్, హిమాచల్​ లో ప్రారంభమైన కౌంటింగ్

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి రెండు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు గుజరాత్ లో బీజేపీ 89 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, కాంగ్రెస్ 26 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ 14, కాంగ్రెస్ 8 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. కాగా, హిమాచల్​లో మొత్తం 59 అసెంబ్లీ సెగ్మెంట్లకు నవంబర్ 12న పోలింగ్ జరగగా.. గుజరాత్​లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఓటింగ్ నిర్వహించారు. ఫలితాలను అంచనా వేస్తూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పార్టీల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్​లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని, రెండో స్థానంలో కాంగ్రెస్, ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటాయని పోల్​సర్వేలు వెల్లడించాయి. హిమాచల్​లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనా వేశాయి. సాయంత్రానికి కల్లా ఫలితాలు రానున్నాయి.

ఉదయం 8  నుంచే ఓట్ల లెక్కింపు

గుజరాత్​లో రాష్ట్రవ్యాప్తంగా 37 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎన్నికల ప్రధాన అధికారి భారతి తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. 182 మంది కౌంటింగ్ అబ్జర్వేటర్లు, 494 మంది సహాయ ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారని తెలిపారు.  కౌంటింగ్ కేంద్రాల మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఈవో తెలిపారు. హిమాచల్​లోనూ మొత్తం 59 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 68 కౌంటింగ్ సెంటర్లలో ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 10 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, ఇతర సహాయక సిబ్బంది కౌంటింగ్ ప్రాసెస్​ను పర్యవేక్షించనున్నారు.

5 రాష్ట్రాల బైపోల్​ ఫలితాలు..

ఐదు రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారమే విడుదల కానున్నాయి. యూపీలోని రాంపూర్, ఖతౌలీ, ఒడిశాలోని పదం పూర్,  రాజస్థాన్​లోని సర్దార్ షహర్, బీహార్​లోని కుర్హానీ, చత్తీస్​గఢ్​లోని భానుప్రతాపూర్ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ఉదయమే ప్రారంభం కానుంది. యూపీలోని మెయిన్​పురి లోక్​సభ సెగ్మెంట్​కు పోలైన ఓట్లకు కౌంటింగ్ జరగనుంది. వీటి ఫలితాలు కూడా గురువారమే ప్రకటించనున్నారు.