పిల్లలతో సహా గోదావరిలోకి దూకిన దంపతులు

 పిల్లలతో సహా గోదావరిలోకి దూకిన దంపతులు

 

  • పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్య
     

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలసి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నెం పున్నెం ఎరుగని ఇద్దరు పసి పిల్లలను చెరొకరు ఎత్తుకుని గోదాట్లోకి దూకేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున గజఈతగాళ్లను పిలపించి గాలింపు చేపట్టారు.
మృతులు తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన భార్యా భర్తలు సతీష్ (34), సంధ్య (28), కుమారుడు జశ్విన్ (4), కుమార్తె జయశ్రీ దుర్గ(2) గా గుర్తించారు. మూడు రోజుల క్రితమే వారు సంధ్య పుట్టింటి నుంచి సతీష్ స్వగ్రామానికి బయలుదేరి కనిపించకుండా పోయారు. దీంతో వీరి బంధువులు, కుటుంబ సభ్యులు పాలకొల్లు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోదావరి తీరంలోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇవ్వగా నిన్న ఉదయం యలమంచిలి మండలం చించివాడ వద్ద గోదావరి బ్రిడ్జి వద్ద ఒక బైకు కనిపించింది, ఆ పక్కనే పిల్లల దుస్తులు, చెప్పులు దొరికాయి. అది మృతుడు సతీష్ కు చెందినవిగానే అనుమానించి గాలింపు చేపట్టగా..  ఇవాళ తూర్పు గోదావరి జిల్లా డిండివాడ వద్ద దంపతుల రెండేళ్ల కుమార్తె దుర్గ మృతదేహం లభ్యమైనట్లు చెబుతున్నారు. మిగిలిన వారి మృతదేహాల కోసం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సూసైడ్ నోట్
బంధువుల వేధింపులే కారణమంటూ సంధ్య (28) రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేఖతోపాటు ఆడియో మెసేజ్ పెట్టారు. నా చావుకు ఎవరూ కారణం కాదని లేఖలో పేర్కొన్నారు. మా ఇంటి వద్ద అక్క.. బావ కొంత ఇబ్బంది పెట్టారు. ఆవేదనతో భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ లేఖ రాసి.. ఆడియో మెసేజ్ ను బంధువులకు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పుట్టింటి నుండి సంధ్య ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకుని భర్త స్వగ్రామానికి బయలుదేరిన వీరు ఇంటికి చేరుకోక ముందే సూసైడ్ నోట్.. ఆడియో మెసేజ్ పంపడం కలకల రేపింది. 
 చించివాడ బ్రిడ్జి వద్ద గోదావరి గట్టు పైన వారి వాహనం..దుస్తులు కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం కలుగుతోంది. వారం క్రితమే గల్ఫ్ నుండి తిరిగొచ్చిన భర్తకు తనపై చోరీ.. వేధింపుల గురించి చెబితే.. తమ జీవితమే నాశనమైందని కంటతడిపెట్టుకున్నాడని.. ఆ మనో వేదనతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్య లేఖ లో పేర్కొంది.