
శంషాబాద్, వెలుగు : ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగగా.. దంపతులు తీవ్రంగా గాయపడ్డ ఘటన ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధి జరిగింది. బాలఏసు కాలనీకి చెందిన కేశవులు, మొగులమ్మ (28) దంపతులకు ఓ బాబు ఉన్నాడు. సోమవారం సాయంత్రం మొగులమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ బాబుకు ఫోన్ ఇచ్చింది. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి గ్యాస్ స్టౌ ఆన్ చేశాడు. అది గమనించని ఆమె వంట చేసేందుకు.. గ్యాస్ ఆదా కోసం కట్టెల పొయ్యిలో కొన్ని కాగితాలు వేసి మంట వెలిగించింది. అప్పటికే లీకైన గ్యాస్‌కు మంటలు అంటుకుని ఒక్కసారిగా చెలరేగాయి.
దీంతో మొగులమ్మకు మంటలంటుకోగా అరుస్తూ ఇంట్లోంచి బయటకు పరుగు తీసింది. అప్పుడే ఇంటికి వచ్చి కూర్చున్న భర్త రక్షించేందుకు ఆమెను పట్టుకొని నీళ్లు పోయగా అతనికి గాయాలయ్యాయి. స్థానికులు వచ్చి దంపతుల పరిస్థితి చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అంబులెన్స్‌కు ఫోన్ చేయగా108 సిబ్బంది గాయపడిన దంపతులను స్థానిక సన్ రైజ్ ఆస్పత్రికి తరలించారు.
మొగులమ్మ 9 నెలల గర్భిణి కావడంతో పాటు70 శాతం కాలిన గాయాలవడంతో ఆమె, కడుపులోని బిడ్డ పరిస్థితిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 3 ఏండ్ల చిన్నారికి మాత్రం ఎలాంటి కాలేదని పోలీసులు తెలిపారు.