ముహూర్తం చూసుకుని..పానం తీసుకున్నరు

V6 Velugu Posted on Nov 09, 2019

కాటారం(మహాదేవపూర్), వెలుగు: కుటుంబ కలహాలతో విసిగిపోయిన వృద్ధ దంపతులు ముహూర్తం నిర్ణయించుకుని మరీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లబండి సాలయ్య(76), రాధమ్మ(66) దంపతులు గ్రామంలో కొడుకు ఇంటికి ఎదురుగా  గుడిసెలో నివసిస్తున్నారు. కొడుకు, కోడలు వారిని మాటలతో అవమానపరుస్తుండడంతో ఆవేదనకు గురయ్యేవారు. గురువారం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురయ్యారు. చనిపోదామని నిర్ణయానికి వచ్చిన దంపతులు తమకు రావాల్సిన కూలి డబ్బులను గురువారం రైతుల నుంచి తీసుకువచ్చారు. తమ అంతిమయాత్రకు సైతం కొడుకు, కోడలుకు ఇబ్బంది కావద్దని రూ. 20,000 జమ చేసి తలాపున పెట్టుకున్నారు. స్థానిక పూజారిని మంచి ముహూర్తాలు ఎప్పటి నుంచి ఉన్నాయని అడిగారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏకాదశి ప్రారంభమవుతుందని తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శవయాత్రకు కావలసిన సరంజామ తెచ్చిపెట్టి, కొత్తబట్టలు వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఎస్సై నర్సయ్య మృతదేహాలను ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tagged couple, sucide, jayashankar, kataram, Bhupalapalli dist.

Latest Videos

Subscribe Now

More News