
గొడవ పడిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్ నారాయణగూడలో జరిగింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్యార్‌సింగ్ నేగి(42), అతని భార్య రేఖారాణి(39) హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్యార్‌సింగ్ అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి భార్యభర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పిల్లలు నిద్రలేచే సరికి తల్లిదండ్రి ఉరివేసుకొని కన్పించారు. వారి మృతదేహాలను చూసిన పిల్లలు దిక్కుతోచని స్థితిలో అక్కడే ఉండిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.