
ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే
కోదాడ రూరల్, వెలుగు: ఒకరి పరీక్ష మరొకరు రాస్తూ ప్రభుత్వ ఉద్యోగుల జంట పట్టుబడిన ఘటన పట్టణంలోని ఎంఎస్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. నాగార్జున ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో భాగంగా ఆదివారం జరగనున్న ఫిజిక్స్ పరీక్షకు ఎండీ సల్మాన్, తిరపతమ్మ హాజరుకావాలి. అయితే వారికి బదులు కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పొలంపల్లి ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న అజ్మీర వెంకటప్పయ్య, అదేవిధంగా వత్సవాయి మండలం పెనుగంచిప్రోలు పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న వెంకటప్పయ్య భార్య కవితలు పరీక్షకు హాజరయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న కోదాడ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాయాల్సిన అసలు అభ్యర్డులను కూడా అదుపులోకి తీసుకుంటామని స్థానిక టౌన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.