సీఎస్‌కు 58 కోట్ల నిధుల కేసు క్లోజ్

సీఎస్‌కు  58 కోట్ల నిధుల కేసు క్లోజ్
  • జీవో 208 సవరణకు ఒప్పుకోని సర్కార్ 
  • అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా జీవో ఉద్దేశాలను పరిగణించాలని వినతి 
  •  నిధులపై స్టే ఎత్తేసి విచారణ ముగించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: చీఫ్‌‌ సెక్రటరీ సోమేష్‌‌ కుమార్‌‌పై కోర్టుధిక్కార కేసుల విచారణ కోసం రూ.58.95 కోట్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవో 208ని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. జీవో ఉద్దేశాలను వివరిస్తూ ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్‌‌లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అందుకు అంగీకరించిన చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమాకోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ నిధుల్ని రిలీజ్‌‌ చేయద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. జీవోను సవాల్‌‌ చేస్తూ మహబూబ్‌‌నగర్‌‌కు చెందిన లెక్చరర్‌‌ ప్రభాకర్‌‌ దాఖలు చేసిన పిల్‌‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. సీఎస్‌‌ పై 2013 నుంచి 2021 వరకూ 181 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని, ఆ కేసుల విచారణ నిమిత్తం రూ.58.95 కోట్ల విడుదలకు జీవోపై స్వయంగా ఆయనే సంతకం చేశారని పిటిషనర్‌‌ పేర్కొన్నారు. పలుసార్లు ఈ పిల్‌‌పై విచారణ సమయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. సీఎస్‌‌పై కోర్టు ధిక్కార కేసులకు అంత భారీగా డబ్బు ఎందుకు? ట్రెజరీ రూల్స్‌‌ ప్రకారం అంత మొత్తం విడుదలకు వీలుందా? ఏ పద్దు కింద ఖర్చు పెడుతున్నారు? అని ప్రశ్నించింది. పిల్‌‌పై విచారణ ముగిసేదాకా నిధుల్ని రిలీజ్‌‌ చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ నిధులు భూసేకరణపై దాఖలైన కోర్టుధిక్కార కేసుల్లో పరిహారం చెల్లింపుల కోసమని, సీఎస్‌‌పై కోర్టు ధిక్కార కేసులకు కాదని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చెప్పారు. జీవో ఉద్దేశాలను అఫిడవిట్‌‌లో పేర్కొన్నామని, దానినే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీంతో స్టేను రద్దు చేసి, పిల్‌‌పై విచారణను ముగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.