కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై కోర్టు సీరియస్

కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై కోర్టు సీరియస్

హైదరాబాద్ అంబర్ పేటలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన కోర్టు.. నాలుగేళ్ల బాలుడిని కుక్కలు దారుణంగా దాడి చేయడం అమానుషమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాలుడి మృతి అత్యంత బాధాకరమని చెప్పింది. జీహెచ్ఎంసీ అసలు ఏం చేస్తోందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ నిర్లక్ష్యంతోనే పసి బాలుడు చనిపోయాడని మండిపడింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలుడు మృతికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి16కి వాయిదా వేసింది.