ఫామ్ హౌస్ కేసు.. హైకోర్టు విచారణ ఈనెల 30కి వాయిదా

ఫామ్ హౌస్ కేసు.. హైకోర్టు విచారణ ఈనెల 30కి వాయిదా

హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మరోసారి బిఎల్ సంతోష్‭కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని చెప్పింది. ఇక ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 30కు వాయిదా వేసింది. 

బీజేపీ తరపున మహేష్ జాట్మాలని వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తుపై  సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని ఏజీ బిఎస్ ప్రసాద్ తెలిపారు. 41ఏ సీఆర్పీసీ ప్రకారం విచారణకు సహకరించాలని బిఎల్ సంతోష్ ను కోరామని చెప్పారు. కాని ఇప్పటివరకు సిట్ నోటీసులు అందినా.. సంతోష్ విచారణకు సహకరించడం లేదని ఏజీ కోర్టుకు విన్నవించారు. బిఎల్‌ సంతోష్‌ను సిట్‌ విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని ఏజీ పేర్కొన్నారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సంతోష్‭కు మరోసారి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.