పోర్నోగ్రఫీ కేసులో నటి ముందస్తు బెయిల్ తిరస్కరణ

 పోర్నోగ్రఫీ కేసులో నటి ముందస్తు బెయిల్ తిరస్కరణ

ముంబయి: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ నటి వందనా తివారి అలియాస్ గెహెనా వశిష్ట్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ముంబయి సెషన్స్ కోర్టు తిరస్కరించింది. గత ఫిబ్రవరి నెలలో తొలిసారిగా పోర్నోగరఫీ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఈమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈమెపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. నటికి సంబంధించిన మొబైల్ ఫోన్.. ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. తాజాగా ముంబై పోలీసులు తమ కస్టడీకి ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేయగా.. విషయం తెలుసుకున్న వందనా తివారి అలియాస్ గెహెనా వశిష్ట్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. 
గురువారం ఈ బెయిల్ పిటిషన్ ను ముంబయి సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. గతంలోనే ఒకసారి అరెస్టయ్యానని.. ఇప్పుడు బెయిల్ పై ఉన్నానని, తన ఫోన్.. ల్యాప్ టాప్ పోలీసులు సీజ్ చేశారని, కాబట్టి మళ్లీ ఇప్పుడు తనను కస్టడీలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని నటి కోరింది. వందన పిటిషన్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. పోర్న్ వీడియోల చిత్రీకరణ సమయంలో వందన బెదిరింపులకు పాల్పడిందని బాధితురాలు స్వయంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల వాదనను ఆలకించిన కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.