
- రాష్ట్రానికి పట్టిన దయ్యం.. రేవంత్, శని.. కాంగ్రెస్
- వాటిని వదిలించడమే మా పని
- అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి
- ఢిల్లీలో రేవంత్‌కు ఇద్దరు బాసులు
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు
- నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు:బీఆర్ఎస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ కోవర్టులు టైమొచ్చినప్పుడు వాళ్లంతట వాళ్లే బయటపడ్తారని చెప్పారు. ‘‘దయ్యాల విషయం ఏమో గానీ తెలంగాణకు పట్టిన దయ్యం.. రేవంత్‌రెడ్డి. రాష్ట్రానికి పట్టిన శని.. కాంగ్రెస్. ఆ దయ్యాన్ని, శనిని వదిలించే పని మాది” అని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. కవిత పేరు ఎత్తకుండా కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. బీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువని ఆయన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండడం తెలంగాణకే అవమానమని కేటీఆర్ అన్నారు. ఆయనకు నైతికత, నిజాయతీ ఉంటే సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో తప్పులు చేసినా రేవంత్‌కు ఇంకా బుద్ధి రాలేదన్నారు. 2015లో ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్‌ను బ్యాగ్మ్యాన్అని పిలుస్తున్నారని, నేషనల్హెరాల్డ్కేసుతో సీటుకు రూట్కుంభకోణంగా మారిందని విమర్శించారు. ‘‘రూ.50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా ముందటనే చెప్పిండు. ఆనాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలకు.. ఇప్పుడు చార్జ్‌షీట్‌తో ఈడీ ఆధారాలు చూపించింది. ఎవరు డబ్బులు ఇచ్చారు? ఏ పొజిషన్‌ని అమ్ముకున్నారు? ఎన్ని డబ్బులు ఇచ్చారు? అన్న వివరాలను ఈడీ తన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా బయటపెట్టింది” అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారు. ‘‘ఢిల్లీ కాంగ్రెస్‌కు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు భారీ మొత్తంలో అందిస్తూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్య మంత్రి కాదు.. మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయింది. 17 నెలల్లోనే 44 సార్లు ఢిల్లీకి పోయి సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకోవడం, కేసుల నుంచి తప్పించాలని వేడుకోవడం, బయటకు వచ్చి పెద్ద పెద్ద పోజులు కొట్టడం.. ఇదే రేవంత్ రెడ్డి 44 సార్లు ఢిల్లీకి పోయి చేసింది. రేవంత్‌కు ఢిల్లీలో ఇద్దరు బాసులు ఉన్నారు. రాహుల్‌గాంధీ అఫీషియల్ బాస్అయితే.. మోదీ, అమిత్‌షా అనఫిషియల్బాసులు” అని అన్నారు. దేశంలోని అన్ని విషయాలపై మాట్లాడే రాహుల్.. తన పార్టీ సీఎం చేస్తున్న అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిం చారు. కాంగ్రెస్‌కు సిగ్గు, నైతిక విలువలు ఉంటే రేవంత్‌ను వెంటనే సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ భూదందాలకు రేవంత్ వత్తాసు
నేషనల్ హెరాల్డ్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్‌పై కర్నాటక బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని.. కానీ తెలంగాణలో అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్‌రెడ్డిని మాత్రం ఏమీ అనడం లేదని కేటీఆర్మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందాలకు సీఎం రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నందుకే మౌనంగా ఉంటున్నారా? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్‌కేసులో సీఎంను విచారించాల్సిందిగా గవర్నర్‌ను కలిసి కోరుతామని చెప్పారు. ‘‘ఇన్ని రోజులుగా రక్షణ కవచంలాగా రేవంత్ రెడ్డిని కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికైనా స్పందించకపోతే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. మీడియా ఎంత తాపత్రయపడినా.. ఎన్ని అడ్వర్టయిజ్‌మెంట్లు తీసుకున్నా రేవంత్‌రెడ్డి ఓ లొట్టపీసు సీఎం అని ప్రజలకు అర్థమైంది. సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు నిజాలు తెలుస్తూనే ఉంటాయి” అని అన్నారు. కాగా, కవిత లేఖ ఎలా లీకైందన్న ప్రశ్నకు మాత్రం కేటీఆర్ జవాబు దాటవేశారు.
మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. గతంలో పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టినప్పుడూ లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు.. అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది. అది నేనైనా.. వేరే ఇంకెవరైనా అలాగే ఉండాలి.