ఏపీలో కొత్త కరోనా వేరియంట్.. 15 రెట్లు వేగం

ఏపీలో కొత్త కరోనా వేరియంట్.. 15 రెట్లు వేగం

విశాఖపట్నం: సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు కొత్త రకం కరోనా వేరియంట్‌‌ను కనుగొన్నారు. విశాఖపట్నంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్‌ను N440Kగా గుర్తించారు. దీన్ని ఏపీ స్ట్రెయిన్‌గా పిలుస్తున్నారు. ఈ రకం కరోనా వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసును కర్నూలులో గుర్తించారు. ఇది దేశంలోని మిగిలిన వేరియంట్స్‌‌తో పోలిస్తే 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందట. అలాగే భారత వేరియంట్లయిన B1.617, B1.618 కంటే ఇది చాలా పవర్‌‌ఫుల్ అని తెలుస్తోంది. ఈ విషయంపై వైజాగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వి.వినయ్ చంద్ స్పందించారు. 

వైజాగ్‌లో వ్యాప్తి అవుతున్న వైరస్ మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉందని వినయ్ చంద్ తెలిపారు. ఈ వైరస్ ఏ రకం అనే దాన్ని తాము ఇంకా నిర్ధారించలేదన్నారు. వైరస్ శాంపిల్స్‌‌ను సీసీఎంబీకి పంపామన్నారు. ఈ వేరియంట్ గురించి ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ పీవీ సుధాకర్ కూడా స్పందించారు. ఈ రకం వైరస్ బారిన పడి వారి ఆరోగ్య పరిస్థితి 3 నుంచి 4 రోజుల్లో విషమంగా మారుతోందన్నారు. అందుకే సిటీలోని ఆస్పత్రుల్లో ఉన్న బెడ్స్, మెడికల్ ఆక్సిజన్, ఐసీయూలు సరిపోవడం లేదన్నారు.