కరోనాతో ఉద్యోగి చనిపోతే ఐదేళ్లు ఫుల్ జీతం

 కరోనాతో ఉద్యోగి చనిపోతే ఐదేళ్లు ఫుల్ జీతం
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం
  • ఉద్యోగి భార్యా పిల్లలతోపాటు ఉద్యోగి తల్లిదండ్రులు అనారోగ్యంపాలైతే ఆస్పత్రి ఖర్చులు
  • పిల్లలు డిగ్రీ పూర్తి చేసే వరకు చదువుల ఖర్చులు
  • పేరోల్ సదుపాయం లేని వారు.. అంటే దినసరి కూలీల వంటి వారు చనిపోతే వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సాయం

ముంబయి: కరోనా కష్ట కాలంలో తమ ఉద్యోగులకు భవిష్యత్తుపై బెంగ లేకుండా చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఎవరైనా  కరోనాతో చనిపోతే... సదరు ఉద్యోగి నామినేట్‌ చేసిన వారికి అయిదేళ్ల పాటు ఫుల్ జీతం అందిస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. అలాగే వారి పిల్లలు డిగ్రీ పూర్తి చేసే వరకు వారి చదువుల ఖర్చును కంపెనీ భరిస్తుందని తెలిపింది. అలాగే ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజుతో పాటు పుస్తకాలకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామని తెలిపింది. 

అంతేకాదు ఉద్యోగి భార్య లేదా భర్త లేదా వారి తలిదండ్రులు, పిల్లలు అనారోగ్యంతో హాస్సిటల్‌లో చేరితే అక్కడయ్యే ఖర్చును కూడా తాము భరిస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పష్టం చేసింది. అంతే కాదు సంస్తలో పే రోల్స్‌ సదుపాయం లేనివారు అంటే దినసరి కూలీలు వంటి వారు చనిపోయినా వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కష్టాలు మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్న ప్రస్తుత సమయంలో భవిష్యత్తుపై బెంగ లేకుండా.. మానసికంగా ధైర్యాన్ని కల్పించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలనాత్మక రీతిలో నిర్ణయం తీసుకుంది.

మీరు ఒంటరి కాదు.. మీ వెను ఎల్లప్పుడూ రిలయన్స్ కుటుంబం అండగా నిలుస్తుంది, అంతే కాదు మీ కుటుంబ సభ్యులతోనూ కలసి మెలసి ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తరపున ఆయన సతీమణి నీతా అంబానీ కంపెనీ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. రిలయన్స్ ఉద్యోగులు ఎవరైనా కరోనా సోకి అస్వస్థతకు గురైతే.. లేదా మానసికంగా ఇబ్బందిపడుతుంటే వైద్యుల సూచనల మేరకు శారీరకంగా.. మానసికంగా పూర్తిగా నయమయ్యే వరకు పూర్తి కాలం సెలవులు పొందవచ్చని స్పష్టం చేసింది. 
బయట పరిస్థితులు చూసి ఎవరూ నిరాశకు లోనుకావద్దని, భయం విడిచిపెట్టి పోరాట స్పూర్తిని కొనసాగించాలని.. మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగాలని ముఖేష్ అంబానీ కోరారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి ముఖేష్ అంబానీ ఎటువంటి జీతం తీసుకోలేదని ఆర్‌ఐఎల్ బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. అయితే, రిలయన్స్ మేనేజింగ్ డైరెక్టర్లు మరియు మొత్తం సమయం డైరెక్టర్లు నిఖిల్ ఆర్ మెస్వానీ మరియు హిటల్ ఆర్ మెస్వానీ మొత్తం రూ .24 కోట్ల వేతనం తీసుకున్నా ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాత్రం తన ఏడాది జీతాన్ని  వదులుకున్నారు.