విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయులకు రిలీఫ్: మే 7 నుంచి స్వ‌స్థలాల‌కు…

విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయులకు రిలీఫ్: మే 7 నుంచి స్వ‌స్థలాల‌కు…

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దాదాపు అన్ని దేశాలు అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌ను బంద్ చేశాయి. దీంతో విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయులు దిక్కుతోచ‌ని స్థితిలో తంటాలు ప‌డుతున్నారు. ఎట్ట‌కేల‌కు వారికి రిలీఫ్ క‌లిగించే వార్త చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. విదేశాల్లో నిలిచిపోయిన భార‌తీయుల‌ను మే 7 నుంచి ద‌శ‌ల వారీగా స్వ‌స్థలాల‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. పేమెంట్ బేసిస్ లో ప్ర‌త్యేక విమానాల్లో ఈ త‌ర‌లింపు చేప‌ట్టేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. ఇందుకోసం వేర్వేరు దేశాల్లో ఉన్న భార‌త ఎంబ‌సీలు, హైక‌మిష‌న్లు ఆయా దేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల జాబితాను సిద్ధం చేస్తోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌మ‌ర్షియ‌ల్ ఫ్లైట్స్ తో పాటు వాయుసేన విమానాలు, నేవీ షిప్ ల‌లోనూ ద‌శ‌ల వారీగా మే 7 నుంచి త‌ర‌లింపు చేప‌ట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

రాష్ట్రాల్లో 14 రోజుల క్వారంటైన్..

విదేశాల నుంచి వ‌చ్చే వారికి ఫ్లైట్ ఎక్కే ముందే మెడిక‌ల్ స్క్రీనింగ్ చేప‌ట్టి.. క‌రోనా ల‌క్ష‌ణాలు లేనివారిని మాత్ర‌మే ప్ర‌యాణానికి అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ తెలిపింది. అలాగే వ‌చ్చేట‌ప్పుడు వారు పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ‌, విమాన‌యాన శాఖ స్టాండ‌ర్డ్ ఆప‌రేష‌న్ ప్రొటోకాల్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్న త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా వైద్య ప‌రీక్ష‌లు చేసి 14 రోజుల పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్ చేయాల‌ని తెలిపింది. ఇందుకోసం రాష్ట్రాల్లో అవ‌స‌రాన్ని బ‌ట్టి స‌రైన స్థాయిలో టె‌స్టింగ్, క్వారంటైన్ ఏర్పాట్లు చేసుకోవాల‌ని కేంద్రం ఇప్ప‌టికే సూచించిన‌ట్లు చెప్పింది.