క‌రోనా డ‌బ్బున్నోళ్ల జ‌బ్బు

క‌రోనా డ‌బ్బున్నోళ్ల జ‌బ్బు

క‌రోనా పేదోళ్ల జ‌బ్బు కాద‌ని, డ‌బ్బున్నోళ్ల జ‌బ్బ‌ని అన్నారు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి. ఈ క‌రోనా వైర‌స్ ఇక్క‌డ‌ పుట్టింది కాదని, దీనిని డ‌బ్బున్నోళ్లే విదేశాల నుంచి మోసుకొచ్చార‌ని చెప్పారాయ‌న‌. గురువారం చెన్నైలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ క‌రోనా వైర‌స్ వ్యాప్తి పేదోళ్ల నుంచి జ‌ర‌గ‌లేద‌ని, విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన‌ డ‌బ్బున్నోళ్లు ఈ వైర‌స్ ను ఇక్క‌డ అంటించార‌ని అన్నారు. నిరు పేద‌లు వాళ్ల‌తో మాట్లాడాల‌న్నా కూడా క‌రోనా వైర‌స్ సోకుతుందేమోనని భ‌య‌ప‌డుతున్నార‌ని చెప్పారు.

జ‌ర్న‌లిస్టుల‌కు రూ.5 ల‌క్ష‌ల ‘క‌రోనా బీమా’

క‌రోనాకు సంబంధించిన ప్ర‌తి వార్త‌ను క‌వ‌ర్ చేస్తూ ప్ర‌జ‌ల‌కు బాగా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌ని జ‌ర్న‌లిస్టుల‌ను ప్ర‌శింసించారు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి. క‌రోనాకు సంబంధించిన వార్త‌ల సేక‌ర‌ణ‌లో అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నార‌ని, పొర‌బాటున జ‌ర్న‌లిస్టుల‌కు ఎవ‌రికైనా క‌రోనా సోకితే వారి బాధ్య‌త ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుంద‌ని భ‌రోసా ఇచ్చారాయ‌న‌. త‌మిళ‌నాడులో అక్రిడిటేష‌న్ ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు ఎవ‌రికైనా క‌రోనా వ‌స్తే చికిత్స ఖ‌ర్చులు పూర్తిగా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. అలాగే ఆర్థిక సాయం చేస్తామ‌ని చెప్పారు ప‌ళ‌నిస్వామి. దురదృష్టవ‌శాత్తు చికిత్స పొందుతూ మ‌ర‌ణిస్తే ఆ జ‌ర్న‌లిస్టు కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామ‌ని తెలిపారు.

1267కు చేరిన క‌రోనా కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంద‌ని చెప్పారు త‌మిళ‌నాడు సీఎం. గురువారం 25 మందికి వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించామ‌ని, వీటితో క‌లిపి మొత్తం క‌రోనా కేసుల‌ 1267కు చేరాయ‌ని తెలిపారు. త‌మిళ‌నాడులో 27 క‌రోనా ల్యాబ్స్ ఉన్నాయ‌ని, రోజూ 5590 టెస్టులు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. క‌రోనాపై పోరాటానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.134.64 కోట్ల విరాళాలు వ‌చ్చాయ‌ని, ఈ దాత‌ల‌తో పాటు వైర‌స్ నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ద‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని అన్నారు ప‌ళ‌నిస్వామి.