క‌రోనా పేషెంట్ల‌కు డ‌యేరియా వ‌స్తే.. కండిష‌న్ సీరియ‌స్!

క‌రోనా పేషెంట్ల‌కు డ‌యేరియా వ‌స్తే.. కండిష‌న్ సీరియ‌స్!

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ పై విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. వైర‌స్ జ‌న్యు క్ర‌మం, దానిలో మార్పులు, మ‌నుషుల‌పై ఎటువంటి ప్ర‌భావం చూపుతోంది వంటి అంశాల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది శాస్త్ర‌వేత్త‌లు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది కొత్త వైర‌స్ కావ‌డంతో దాని ల‌క్ష‌ణాల‌పై కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొద‌ట్లో జ‌లుబు, ద‌గ్గు, గొంంతు నొప్పి, ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టం వంటి ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉంటాయ‌ని చెప్పారు. అయితే అతి కొద్ది కేసుల్లో జీర్ణ వ్య‌వ‌స్థ‌పై కూడా ప్ర‌భావం చూపి డ‌యేరియా కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తేలింది. ఇలా డ‌యేరియా వ‌చ్చి తీవ్రంగా విరోచ‌నాలు అయ్యే క‌రోనా పేషెంట్ల ఆరోగ్యం విష‌మిస్తోంద‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. డ‌యేరియా లేని క‌రోనా పేషెంట్ల‌తో పోలిస్తే వీరి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంద‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. నిమోనియా కూడా తీవ్ర‌మై.. వెంటిలేట‌ర్ సాయం అవ‌స‌రమ‌వుతుంద‌ని చెప్పారు.

చైనాలోని స‌న్ యాట్ సెన్ యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్ కి చెందిన రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోయంట్రాల‌జీ శాస్త్ర‌వేత్త‌లు 232 మంది క‌రోనా పేషెంట్ల డేటా సేక‌రించి వారి జీర్ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలపై అధ్య‌య‌నం చేశారు. వారి రీసెర్చ్ ఫ‌లితాల‌ను లాన్సెంట్ గ్యాస్ట్రోయాంట్రాల‌జీ అండ్ హెప‌టాల‌జీ జ‌ర్న‌ల్ లో ప్ర‌చురించారు. క‌రోనా వైర‌స్ పుట్టిన హుబేయ్ ప్రావిన్స్ స‌హా ప‌లు రాష్ట్రాల్లోని 14 ఆస్ప‌త్రుల్లోని పేషెంట్ల‌పై స్ట‌డీ చేశారు శాస్త్ర‌వేత్త‌లు. మొత్తం 232 మంది పేషెంట్ల‌లో ఎక్కువ మందికి జ్వ‌రం, ద‌గ్గు, గొంతులో గ‌ళ్ల ప‌ట్టేయ‌డం లాంటి ల‌క్ష‌ణాలే ఉన్నాయి. వారిలో 21 శాతం పేషెంట్లు అంటే 49 మందికి మాత్ర‌మే డ‌యేరియా వ‌చ్చింది. ఈ డ‌యేరియా ల‌క్ష‌ణాలు కూడా అధికంగా వృద్ధుల్లోనే క‌నిపించాయి. వీరికి మిగిలిన వారితో పోలిస్తే వేగంగా నిమోనియా తీవ్ర‌స్థాయిలో వ‌చ్చింది. సాధార‌ణంగా డ‌యేరియాకు, శ్వాస స‌మ‌స్య‌ల‌కు సంబంధం లేదు. అయిన‌ప్ప‌టికీ వీరిలో చాలా మందికి ఐసీయూలో ట్రీట్మెంట్, వెంటిలేట‌ర్ పెట్టాల్సివ‌చ్చింద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. క‌రోనా పేషెంట్ల‌కు డ‌యేరియా సోక‌డానికి కార‌ణం.. లోపిన‌వైర్, రిటోన‌వైర్ వంటి యాంటీ వైర‌స్ టాబ్లెట్స్ ఇవ్వ‌డ‌మేన‌ని రీసెర్చ‌ర్స్ పేర్కొన్నారు. అయితే ఇలా డయేరియా వ‌చ్చిన వారిలోనూ ఎక్కువ మంది వృద్ధులే ఉన్న‌ట్లు చెప్పారు.