కరోనా ఎంత డేంజరో భారత్‌‌లో చూస్తున్నాం

కరోనా ఎంత డేంజరో భారత్‌‌లో చూస్తున్నాం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 3.30 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ స్పందించారు. భారత పరిస్థితి చూస్తుంటే ఓ వైరస్ ఎంత బీభత్సం సృష్టించగలదో అర్థం అవుతోందని గెబ్రియోస్ అన్నారు. ఇండియాలో కరోనా పాజిటివ్‌‌ కేసులు, వైరస్ మరణాలపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. 

‘భారత్‌లో కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు విషమంగా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న రకాలుగా స్పందన వస్తోంది. ఈ కఠిన పరిస్థితులను తట్టుకుంటూ, వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నాం. అక్కడి ప్రభుత్వం ఒకవైపు సోషల్ మిక్సింగ్‌‌ను తగ్గిస్తూ మరోవైపు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతోంది. కరోనా వల్ల భారత్‌‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు డబ్ల్యూహెచ్‌వో తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. దేశ ప్రజలు, ప్రభుత్వానికి మేం మద్దతుగా ఉంటాం’ అని గెబ్రియోస్ స్పష్టం చేశారు.