మరో ఆరు నెలల్లో కోవిడ్ అదుపులోకి వస్తోంది

మరో ఆరు నెలల్లో కోవిడ్ అదుపులోకి వస్తోంది

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మరో ఆరు నెలల్లో అదుపులోకి వస్తోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్ అన్నారు. కరోనా వైరస్ తమ అంచానాలను తలకిందులు చేసిందని.. త్వరలోనే కరోనా లేని స్థితికి చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కోవిడ్ మరణాలు, కేసుల సంఖ్య నియంత్రణలో ఉంటే.. మహమ్మారిని అదుపు చేయవచ్చని సుజీత్ సింగ్ అన్నారు. 

‘కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళ కూడా క్రమక్రమంగా బయటపడుతోంది. వ్యాక్సినేషన్ వల్లే ఇది సాధ్యమవుతోంది. ప్రస్తుతం దేశంలో 75 కోట్ల మందికి టీకాలు వేశారు. కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ ప్రభావం 70 శాతం ఉంది. దేశంలో దాదాపు 50 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని రోగనిరోధక శక్తిని పొందారు. కాగా.. ఇప్పటివరకు 30 కోట్ల మంది ప్రజలు ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరికి 30 నుంచి 31 శాతం రోగనిరోధక శక్తి లభిస్తోంది. 

టీకాలు వేసిన తర్వాత కూడా ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు మరియు భౌతిక దూరం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు హెచ్చరించారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా బారినపడటం కేవలం 20 నుంచి 30 శాతం కేసులలోనే జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 70 నుంచి 100 రోజుల్లో రోగనిరోధక శక్తి తగ్గడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు రావడం మొదలవుతుంది. ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ లేదు. అంతేకాకుండా.. ఆందోళన కలిగిస్తున్న C1.2 మరియు మ్యూటెంట్ జాతులు దేశంలో కనుగొనబడలేదు. మూడో వేవ్‎కు మరో కొత్త రకం వేరియంట్ మాత్రమే కారణం కాదు. వచ్చే రోజుల్లో పండుగలున్నాయి కాబట్టి కొంత ఆందోళన పడాల్సిన అవసరం ఉంది’ అని సుజీత్ సింగ్ అన్నారు.