2 వారాలు ఆంక్షలు అమలు చేయాలని సూచన  

 2 వారాలు ఆంక్షలు అమలు చేయాలని సూచన  

 

  •     జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలె
  •     2 వారాలు ఆంక్షలు అమలు చేయాలని సూచన   

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కొత్త వేరియంట్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఐదంచెల స్ట్రాటజీని అమలు చేయాలని.. కంటైన్ మెంట్, టెస్టింగ్ అండ్ సర్వైలెన్స్, క్లినికల్ మేనేజ్ మెంట్, కొవిడ్ సేఫ్ బిహేవియర్, వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాలని చెప్పింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపింది. ఏదైనా జిల్లాలో పాజిటివిటీ రేటు 10 శాతం దాటినా, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ 40 శాతం నిండినా.. ఆయా జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలంది. కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ముఖ్యంగా రానున్న పండగల టైమ్ లో అలర్ట్ గా ఉండాలని సూచించింది. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని.. అందుకు నైట్ కర్ఫ్యూలు పెట్టడంతో పాటు సభలు, సమావేశాలపై నిషేధం విధించాలని ఆదేశించింది. ఎలాంటి ఆంక్షలు విధించినా, కనీసం 2 వారాలు అమలు చేయాలంది. కొత్త కేసులు నమోదు కాకున్నా, ఆంక్షలు విధించొచ్చని చెప్పింది. గురువారం కరోనా కట్టడిపై కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్​లో  రివ్యూ చేశారు. రాష్ట్రాలు, యూటీలకు పలు సూచనలు చేశారు.  

కేంద్రం గైడ్ లైన్స్ ఇవే..  
జిల్లాలపై నిఘా పెట్టాలి. డెల్టా, ఒమిక్రాన్ కేసుల నమోదును.. రోజు వారీగా, వారం వారీగా పాజిటివిటీ రేటును పరిశీలించాలి. జిల్లాల్లో కేసులు పెరిగితే కంటైన్ మెంట్, బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలి. ఆయా జోన్లలో ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలి. ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలి. వ్యాక్సినేషన్ ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రజలందరూ రెండు డోసులు వేసుకునేలా చూడాలి. వ్యాక్సినేషన్ రేటు తక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిసారించాలి. డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ ను అమలు చేయాలి. త్వరలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు మరింత అలర్ట్ గా ఉండాలి. వంద శాతం వ్యాక్సినేషన్ సాధించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలి. అంబులెన్స్ లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలి. 

 

మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ.. 
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. అక్కడ ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ, ముందస్తు చర్యల్లో భాగంగా ఆంక్షలు పెట్టారు. ‘‘రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇది అమల్లో ఉంటుంది. అవసరమైతే మరిన్ని ఆంక్షలు విధిస్తాం. ఒమిక్రాన్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే రూల్స్ పెడ్తున్నాం” అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

దేశంలో 60% మందికి రెండు డోసుల టీకాలు
దేశంలో 18 ఏండ్లు దాటినోళ్లలో 60 శాతం మందికి 2 డోసుల కరోనా వ్యాక్సిన్​లు పూర్తయ్యాయని కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇప్పటికి 139.70 కోట్లకు పైగా డోసుల టీకాలను వేసినట్లు గురువారం ఆయన ట్వీట్ చేశారు. హెల్త్ వర్కర్ల డెడికేషన్, ప్రజల సహకారంతోనే ఈ మైలురాయిని చేరుకున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రజల్లో దాదాపు 89 శాతం మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించామని ఆరోగ్యశాఖ తెలిపింది.

బూస్టర్‌‌‌‌ డోస్ లు ఇప్పుడే వద్దు: డబ్ల్యూహెచ్ వో
జెనీవా: కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేయడానికి తొందరవద్దని డబ్ల్యూహెచ్‌‌వో డైరెక్టర్ జనరల్‌‌ టెడ్రోస్ అథనమ్‌‌ గురువారం చెప్పారు. బూస్టర్‌‌‌‌ డోసుపై ధనిక దేశాలు చూపిస్తున్న ఆసక్తి వైరస్‌‌ ముప్పును మరింతకాలం పొడిగిస్తుందన్నారు. అలాగైతే చిన్న దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండదన్నారు. దీంతో మరిన్ని వేరియంట్లు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘‘2 డోసులు తీసుకున్న వ్యక్తికి బూస్టర్ డోసు ఇవ్వడం కంటే వైరస్ వ్యాపించేందుకు ఎక్కువ చాన్స్ ఉన్న వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయారిటీ ఇవ్వాలి’’ అని టెడ్రోస్ పేర్కొన్నారు. కాగా, అన్ని దేశాల్లో కనీసం 40 శాతం మందికి ఫస్ట్‌‌ డోసు వేసేదాకా, హెల్దీగా ఉన్నళ్లకు బూస్టర్ డోసులు వేయడంపై టెంపరరీగా నిషేధం విధించాలని టెడ్రోస్‌‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఒమిక్రాన్‌‌ వేరియంట్‌‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రాజెనెకా బూస్టర్‌‌‌‌ డోసు ఎఫీషియంట్‌‌గా పనిచేస్తుందని ఆక్స్‌‌ఫర్డ్ వర్సిటీ స్టడీలో వెల్లడైంది. కరోనా అన్ని వేరియంట్ల నుంచి నేచురల్‌‌గా రికవరైన పేషెంట్ల కంటే బూస్టర్ డోసు తీసుకున్నోళ్లలో ఎక్కువ యాంటీబాడీలు ఉన్నాయని ఆస్ట్రాజెనెకా గురువారం వెల్లడించింది.