
- ఫేజ్3 ట్రయల్స్ ఇంటరిమ్ అనాలిసిస్ డేటా వెల్లడి
- ఎమర్జెన్సీ యూజ్‌పై దేశాలను కోరతామన్న సంస్థ సీఈవో
ఫేజ్3 ట్రయల్స్‌లో ఫైజర్ కరోనా టీకా ‘బీఎన్టీ162బీ2’ మంచి ఫలితాలనిస్తోంది. కరోనా నుంచి 90 శాతం వరకు వ్యాక్సిన్ రక్షణ ఇస్తున్నట్టు కంపెనీ సీఈవో డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. ట్రయల్స్ ఇంటెరిమ్ డేటాను పరిశీలించిన డేటా మానిటరింగ్ కమిటీ ఈ విషయం చెప్పిందన్నారు. బయోఎన్‌టెక్ అనే సంస్థతో కలిసి ఫైజర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో మరో ముందడుగు పడింది. జర్మనీకి చెందిన బయోఎన్టెక్ఎస్ఈ అనే కంపెనీతో కలిసి ఫైజర్ తయారు చేస్తున్న ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ‘బీఎన్టీ162బీ2’ మంచి ఫలితాలనిస్తోంది. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా చేసిన ఇంటరిమ్ అనాలిసిస్లో టీకా ఎఫికసీ (ప్రభావం) 90 శాతం దాకా ఉందని ఫైజర్ చైర్మన్, సీఈవో డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. రాబోయే రోజుల్లో వేలాది మందిపై చేస్తున్న ట్రయల్స్ డేటాను వెల్లడిస్తామని చెప్పారు. ట్రయల్స్‌లో భాగమైన 94 మంది వలంటీర్లపై టీకా ప్రభావాన్ని ఇండిపెండెంట్ డేటా మానిటరింగ్ కమిటీ (డీఎంసీ) పరిశీలించిందన్నారు. అందులో కొందరికి వ్యాక్సిన్‌ను, మరికొందరికి ప్లాసిబో (డమ్మీ మందు)ను వేసినట్టు వివరించారు. రెండు సందర్భాలను పరిశీలించాక టీకా ప్రభావం 90 శాతం ఉన్నట్టు డీఎంసీ చెప్పిందన్నారు. వలంటీర్లపై ఎలాంటి చెడు ప్రభావాలు లేవన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకంపై ప్రపంచ దేశాలకు దరఖాస్తు చేసుకుంటామన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 43,538 మందిపై వ్యాక్సిన్ మూడో ఫేజ్ ట్రయల్స్ చేస్తోంది ఫైజర్. అందులో 38,955 మందికి రెండో డోసును కూడా ఇచ్చింది. ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లతో పాటు ఆల్రెడీ కరోనా సోకినవాళ్లపైనా టీకా ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లు, వచ్చే ఏడాది 130 కోట్ల డోసులను తయారు చేసేందుకు ఫైజర్ ఏర్పాట్లు చేసుకుంటోంది.