కొవిన్​ పోర్టల్​ డేటా సేఫ్‌.. లీక్ జరగలేదన్న ప్రభుత్వం

కొవిన్​ పోర్టల్​ డేటా సేఫ్‌.. లీక్ జరగలేదన్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ​కోసం డెవెలప్​ చేసిన కొవిన్​ పోర్టల్​ డేటా లీకైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆధార్, పాన్​కార్డ్​ వివరాలు వెల్లడయ్యాయని పేర్కొన్నాయి.  లీక్ అయిన డేటా సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫారమ్ టెలిగ్రామ్‌‌‌‌లో అందుబాటులో ఉందని, ఏ యూజర్ అయినా యాక్సెస్ చేయవచ్చని విమర్శించాయి. అయితే ప్రభుత్వం ఈ విమర్శలను కొట్టిపారేసింది.   కొవిన్​ యాప్ హ్యాకింగ్‌‌‌‌ ఆరోపణలను తిరస్కరించింది. ‘‘ఇవన్నీ నిరాధార ఆరోపణలు. హ్యాకింగ్​ జరగలేదు. పోర్టల్​సురక్షితంగా ఉంది. డేటా లీక్​కాకుండా అడ్డుకునేందుకు వెబ్​ అప్లికేషన్​ ఫైర్​వాల్, యాంటీ–డీడీఓఓస్, ఎస్​ఎల్​ఎల్​/టీఎల్​ఎస్​, రెగ్యులర్​ వల్నరబిలిటీ అసెస్​మెంట్, ఐడెంటిటీ యాండ్​ యాక్సెస్​ మేనేజ్​మెంట్ వంటి టెక్నాలజీలు వాడుతున్నాం. ఓటీపీ అథెంటికేషన్​ ద్వారా మాత్రమే డేటాను పొందడం వీలవుతుంది. డేటా లీక్​వార్తలపై దర్యాప్తు చేస్తున్నాం”అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, టెలిగ్రామ్ చాట్‌‌‌‌బాట్‌‌‌‌ ద్వారా సమాచారం బయటకు పొక్కిందని టీఎంసీ నాయకుడు సాకేత్ గోఖలేతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. కరోనా టీకా కోసం ఉపయోగించే ఐడీ కార్డ్ నంబర్‌‌‌‌తో పాటు లింగం, పుట్టిన సంవత్సరం,  టీకా కేంద్రం పేరు, డోస్​ వంటి వివరాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.  కాంగ్రెస్​ నాయకుడు చిదంబరం డోస్​ వివరాలతో కూడిన స్క్రీన్​షాట్లు ఆన్​లైన్​లో కనిపించాయి. డేటా లీక్ బాధితులలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా ఉన్నారని ఒక మలయాళ దినపత్రిక ప్రచురించింది. కొవిన్ హైపవర్ ప్యానెల్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యాయని పేర్కొంది.