కరోనా బూస్టర్ డోస్ ధరలు భారీగా తగ్గింపు

కరోనా బూస్టర్ డోస్ ధరలు భారీగా తగ్గింపు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. దాంతో బూస్టర్ డోసును ట్యాక్స్ కాకుండా రూ. 600లకు అమ్మాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ.225కి సవరించారు. బూస్టర్ డోస్‎ను రూ. 225లకే ప్రైవేట్ ఆస్పత్రులకు అందచేయనున్నట్లు సీఐఐ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. 

‘కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ.225కి సవరించాలని సీరమ్ కంపెనీ నిర్ణయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 18 ఏండ్లు పైబడిన వారికోసం ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేం మరోసారి అభినందిస్తున్నాం’ అని పూనావాలా ట్వీట్ చేశారు.

సీరమ్ కంపెనీ బాటలోనే భారత్ బయోటెక్ కూడా బూస్టర్ డోస్ ధర విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన బూస్టర్ డోస్ ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 225 అందిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలిపారు. ‘కోవాగ్జిన్ ధరను తగ్గిస్తున్నాం. 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం కోవాగ్జిన్ ధరను ఒక్కో డోసుకు రూ.1200 నుండి రూ.225కి సవరించాలని మేము నిర్ణయించుకున్నాం’ అని ఆమె ట్వీట్ చేశారు.

కాగా.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ మాదిరిగా బూస్టర్ డోసును ఫ్రీగా కాకుండా.. ప్రైవేట్‎గా వేయించుకోవాలని కేంద్రం సూచించింది.  ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఆదివారం నుంచి కరోనా వైరస్ బూస్టర్ షాట్‌లను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా స్వాగతించారు. ఇది కీలకమైన మరియు సమయానుకూల నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అనేక దేశాలు బూస్టర్ డోస్ తీసుకోని వారిపై ఆంక్షలు విధించినందున మూడో డోస్ అనివార్యం అయింది. దాంతో చాలామంది బూస్టర్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభుత్వం హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు ఉచితంగా అందిస్తోంది.

For More News..

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి