గోరక్షకుడిపై రివాల్వర్‌‌‌తో కాల్పులు.. మేడ్చల్ జిల్లా యమ్నంపేట్‌‌లో ఘటన

గోరక్షకుడిపై రివాల్వర్‌‌‌తో కాల్పులు.. మేడ్చల్ జిల్లా యమ్నంపేట్‌‌లో ఘటన
  • చాతి పక్కనుంచి దూసుకెళ్లిన బుల్లెట్.. ఆస్పత్రిలో బాధితుడు 
  • పరామర్శించిన కిషన్ రెడ్డి, రాంచందర్‌‌‌‌రావు

ఘట్‌‌కేసర్/పద్మారావునగర్, వెలుగు: గోవుల తరలింపును అడ్డుకున్నాడన్న కక్షతో గోరక్షకుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మేడ్చల్​జిల్లా పోచారం ఐటీ కారిడార్‌‌‌‌ పోలీస్ స్టేషస్ పరిధిలో జరిగింది. హైదరాబాద్‌‌లోని బహదూర్‌‌‌‌పురాకు చెందిన ఇబ్రహీం వివిధ జిల్లాల్లో జరిగే పశువుల సంతల్లో ఆవులను కొనుగోలు చేసి నగరంలోని కబేళాలకు తరలిస్తుంటాడు. కీసర మండలం రాంపల్లి ఆర్ఎల్‌‌నగర్‌‌‌‌లో ఉండే ప్రశాంత్​సింగ్ అలియాస్ సోనూ సింగ్ గోరక్షక్​దళ్ సభ్యుడిగా పని చేస్తున్నాడు. 

ఇతడు గతంలో పలుచోట్ల గోవుల తరలింపును అడ్డుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇబ్రహీంకు చెందిన 32 ఆవులను తరలిస్తున్న క్రమంలో యమ్నంపేట్‌‌​చౌరస్తా దగ్గర ఔటర్​రింగ్​రోడ్​వద్ద పోలీసులకు పట్టించాడు. దీంతో సోనూ సింగ్‌‌పై ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుందామని చెప్పి సోనూ సింగ్‌‌ను యమ్నంపేట్‌‌ క్రిస్టీ స్టీల్ సమీపంలోని వెంచర్​దగ్గరికి పిలిపించాడు. ఆ టైమ్‌‌లో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. 

దీంతో కోపోద్రిక్తుడైన ఇబ్రహీం తన వెంట తెచ్చుకున్న రివాల్వర్‌‌‌‌తో సోనూను బెదిరించేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయినా సోనూ సింగ్ బెదరకపోవడంతో అతడి చాతిపై ఫైరింగ్ చేశాడు. ఒక బుల్లెట్​చాతి ఎడమ వైపు నుంచి దూసుకెళ్లింది. దీంతో అతడు రక్షించండంటూ కేకలు వేసుకుంటూ రోడ్డుపైకి పరుగులు తీసి కుప్పకూలాడు. ఇబ్రహీం అక్కడి నుంచి పరారయ్యాడు. కిందపడిపోయిన సోనూను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి బాధితుడిని నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రస్తుతం సోనూసింగ్ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. హత్యాయత్నానికి పాల్పడిన ఇబ్రహీం కోసం స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్​బాబు పరిశీలించారు. క్లూస్​టీమ్ ఆధారాలు సేకరించింది. 

బాధితుడిని పరామర్శించిన బీజేపీ నేతలు.. 
సికింద్రాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ పొందుతున్న గోరక్షక్ దళ్ సభ్యుడు సోనూసింగ్‌‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పరామర్శించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి హింసాత్మక చర్యలను బీజేపీ ఎప్పటికీ సహించదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

నేడు డీజీపీ ఆఫీసు ఎదుట బీజేపీ నిరసన.. 
గోరక్షకుడిపై కాల్పులకు నిరసనగా డీజీపీ ఆఫీసు ఎదుట ఆందోళన చేయాలని బీజేపీ నిర్ణయించింది. గురువారం ఉదయం 11 గంటలకు డీజీపీ ఆఫీసు ఎదుట జరిగే నిరసనలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు, ఇతర నేతలు పాల్గొననున్నారు.