
- సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని సీపీ అనురాధ హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని సీపీ ఆఫీస్ లో పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముఖ్యమని, నిజాయితీగా విధులు నిర్వహించాలని, పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా పెంచి, గంజాయి రహిత జిల్లాకు కృషి చేయాలన్నారు.
వినాయక చవితి సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్, ఆర్గనైజర్లు, కమిటీ మెంబర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. పోక్సో కేసుల్లో భరోసా సెంటర్ సేవలు వినియోగించుకోవాలని, క్రైమ్ ప్రో ఏరియాపై నిఘా పెంచాలని సూచించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 32 మంది పోలీస్ అధికారులకు, సిబ్బందికి రివార్డ్స్ అందజేశారు.
రామచంద్రాపురం/పటాన్చెరు: గణేశ్మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డీఎస్పీ ప్రభాకర్ సూచించారు. పటాన్చెరులో వివిధ శాఖల అధికారులతో కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ పెద్దలు, మండపాల నిర్వాహకులకు పలు సూచనలు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్‌శాఖతో పాటు జీహెచ్ఎంసీ, ఫైర్‌శాఖల అనుమతి తీసుకోవాలన్నారు.
ఆన్లైన్ ద్వారా కూడా వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. రహదారులకు అడ్డంగా, ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా మండపాలు ఏర్పాటు చేయొద్దన్నారు. విద్యుత్ లైన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
నర్సాపూర్ : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ నాగేందర్ గౌడ్ అన్నారు. నర్సాపూర్ లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేసి మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వినాయక మండపాల వద్ద డీజేలు నిషేధమన్నారు. ఆన్లైన్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ జాన్ రెడ్డి, తహసీల్దార్శ్రీనివాస్, ఎస్సై లింగం పాల్గొన్నారు.