
భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) రాష్ట్రపతి భవన్ లో రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రసిడెంట్ ద్రౌపది ముర్ము. ఉదయం 10.10 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్కర్, వెంకయ్య నాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితర నేతలతో పాటు అధికారులు హాజరయ్యారు.
చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. భారత రెండవ అత్యున్నత పౌరుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీపీ.రాధాకృష్ణన్‌కు మొదటి ప్రాధాన్యత కింద 452 ఓట్లు పోలవ్వగా.. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పడ్డాయి. పార్లమెంట్ బిల్డింగ్‌లోని వసుధ కాంప్లెక్స్ రూమ్ 101లో మంగళవారం (సెప్టెంబర్ 09) పోలింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
ALSO READ : రాహుల్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించట్లే ..
మొత్తం 781 మంది ఎంపీలకుగాను 767 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ నుంచి 12 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు. 752 బ్యాలెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు 98.20 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి కోటా విజయానికి కావాల్సిన ఓట్లు 377 కాగా.. మొదటి ప్రాధాన్యత కింద సీపీ.రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు నమోదయ్యాయి.
దీంతో ఎన్డీయే అభ్యర్థి.. ఇండియా కూటమి క్యాండిడేట్ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ.మోదీ ప్రకటించారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మూడో వ్యక్తిగా రాధాకృష్ణన్ నిలిచారు.