ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం : సీపీ ఎస్ఎం.విజయ్ కుమార్

ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం : సీపీ ఎస్ఎం.విజయ్ కుమార్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట  జిల్లాలో ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇస్తామని, అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని సీపీ ఎస్ఎం.విజయ్ కుమార్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తామని, గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 5 చెక్ పోస్టులు, 26 ఫ్లయింగ్ స్క్వాడ్స్​ను నియమించామని తెలిపారు.

 డబ్బులు, మద్యం  సరఫరా చేసి ఓటర్లను ప్రభావితం చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిసినా డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్  నంబర్ 8712667100కు కాల్ చేయాలని కోరారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) కుశాల్కర్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, నరసింహులు, సదానందం, ఎస్బీ సీఐ కిరణ్ పాల్గొన్నారు.

10 నుంచి సిటీ  పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 10 నుంచి 25 వరకు సిటీ  పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆ సమయంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. నిర్వహించాల్సి వస్తే ముందుగా పోలీసుల అనుమతి  తీసుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలో డీజేల వినియోగంపైనా నిషేధం ఉందని, మైక్ సెట్ తప్పనిసరిగా ఉపయోగించాలంటే డివిజన్ ఏసీపీ అనుమతి పొందాలని సూచించారు.