
- 21న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ( సీపీగెట్–2025) ద్వారా నిర్వహించిన ప్రవేశపరీక్షల ప్రిలిమినరీ కీలు రిలీజ్ అయ్యాయి. సోమవారం 32 సబ్జెక్టులకు సంబంధించిన ప్రిలిమినరీ కీలను అధికారిక వెబ్‌సైట్ https://cpget.tgche.ac.in లో అందుబాటులో ఉంచినట్టు సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
ఎంఏ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లిష్, హిందీ, ఫిలాసఫీ, సంస్కృతం, సోషిలాలజీ, సైకాలజీ, ఎంఎస్సీ జువాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, బాటనీ, కెమిస్ర్టీ, బయోటెక్నాలజీ, మ్యాథ్స్, ఎంకామ్, ఎంఈడీ తదితర సబ్జెక్టుల కీలను వెబ్ సైట్లో పెట్టారు. కాగా, ఈ నెల 6 నుంచి11 వరకు సీపీగెట్ పరీక్షలు జరిగాయి.
51,965 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 45,477 (87.51%) మంది అటెండ్ అయ్యారు. ప్రిలిమినరీ కీలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 21న ఉదయం 11 గంటల వరకు ఆన్ లైన్ లో సమర్పించాలని కోరారు. అయితే, ఒక్కో ఆబ్జెక్షన్ కు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని, అభ్యంతరం సరైనది అని తేలితే ఆ డబ్బులు వాపస్ చేస్తామని వెల్లడించారు.