రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టిస్తున్నది : డి.రాజా

రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టిస్తున్నది : డి.రాజా
  • కార్పొరేట్ నియంత్రణలోకి దేశం పోతున్నది

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ వ్యవస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ఖమ్మంలో డిసెంబర్ 25న నిర్వహించనున్న సీపీఐ శతాబ్ధి ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని పార్టీ స్టేట్ ఆఫీస్ మక్దూంభవన్​లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ నియంత్రణ, ఫాసిస్టు రాజ్యం వైపు నెడ్తున్నది. లౌకిక, ప్రజాస్వామిక, సంక్షేమ రాజ్యాంగం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాన్ని దెబ్బతీస్తున్నది. ట్రంప్ టారిఫ్​తో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతున్నది. 

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నది’’అని రాజా అన్నారు. విదేశీ వ్యవహారాల పాలసీలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా విమర్శించారు. ‘ఆపరేషన్ కగార్’ విషయంలో సీపీఐ పాత్రను మేధావులు అభినందించారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండి సురేశ్ పాల్గొన్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబు ఓవర్ యాక్షన్ వల్లే బనకచర్ల వివాదం తలెత్తిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టారని, అది పూర్తయ్యేనాటికి మొత్తం వ్యయం రూ.2 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్ల పెట్టుబడులతో ప్రాజెక్ట్ కడితే.. టోల్​గేట్ వద్ద ఎలాగైతే డబ్బులు వసూలు చేస్తారో.. నీటికి అలా డబ్బు వసూలు చేస్తారన్నారు.