
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని బాసెట్టి గంగారం భవనంలో సీపీఐ టౌన్ 21వ మహాసభను ఘనంగా నిర్వహించారు. పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షత వహించిన కార్యక్రమానికి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ చీఫ్గెస్టులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లు, వీధి దీపాలు, ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను వార్డు సభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. జీవో 58, 59 ప్రకారం పట్టాలు, రేషన్ కార్డుల పంపిణీ పూర్తిచేయాలని, భూకబ్జాల నియంత్రణకు హైడ్రాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు చిప్ప నర్సయ్య, బొంతల లక్ష్మీనారాయణ, బియ్యాల ఉపేందర్, బొంకూరి రామచందర్, బి.శంకర్, ఎం.రమేశ్, ఎస్.రాజేందర్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.