పాల్వంచ, వెలుగు : ‘కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్లు పెట్టి మరీ మావోయిస్టులను చంపుతోంది.. ఇది ప్రజాస్వామ్య దేశమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. సీపీఐ శతవసంతాల సభలో భాగంగా చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ కేఎస్పీ రోడ్డులో సాగింది. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను చంపడం సరికాదన్నారు.
ప్రభుత్వమే డైరెక్ట్‌గా చేస్తున్న ఈ హత్యలపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో దుర్మార్గ పాలన సాగుతోందని, ఈ పాలనను అంతమొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్, జిల్లా కార్యదర్శి ఎస్‌కే.సాబీర్‌పాషా, నాయకులు మారపాక అనిల్, మణికంఠరెడ్డి, రహమాన్, లక్ష్మి, ప్రసాద్, వీసంశెట్టి పూర్ణ, ఉప్పుశెట్టి రాహుల్, రేసు ఎల్లయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
