కాంగ్రెస్​తో పొత్తు ఇంకా కుదరలె: కె. నారాయణ

కాంగ్రెస్​తో పొత్తు ఇంకా కుదరలె:  కె. నారాయణ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహన కుదిరిందని, ఇంకా సీట్ల అవగాహన మాత్రం కుదరలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఊహాగానాలు నమ్మవద్దని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మంగళవారం మగ్దూంభవన్​ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ నేతలు అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి తదితరులతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. 

సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో ఐదు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్​ కు జాబితా అందించామని, సీట్లపై జాతీయ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసే ఉన్నాయని, రాష్ట్రాలలో మాత్రం కొన్ని చోట్ల కలిసి, కొన్ని చోట్ల విభేదించుకుంటున్నామని తెలిపారు. 

ఇండియా కూటమి భాగస్వాములు కేరళ, పశ్చిమ బెంగాల్ లలో జరిగే ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినా, దేశస్థాయిలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటిగా ఉన్నాయన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా చత్తీస్ గఢ్ లో సీపీఎం, సీపీఐ కలిపి 40–45 స్థానాల్లో, మధ్యప్రదేశ్​లో చెరో 14 స్థానాల్లో, రాజస్థాన్ లో సీపీఐ14,  సీపీఎం15 స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు.  

ఎన్నికల సంఘానికి లేఖ 

ఎన్నికల షెడ్యూలు వెలువడేందుకు ఆరు నెలల ముందు నుంచే ఎలాంటి ఎన్నికల హామీలు, స్కీములు ప్రకటించకుండా, అధికారుల బదిలీలు చేయకుండా నిరోధించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను నారాయణ కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 

షెడ్యూలుకు ఒకటి, రెండు రోజుల ముందు కూడా పోలీసులు, సివిల్, రెవెన్యూ అధికారులను ప్రభుత్వాలు బదిలీలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే షెడ్యూలుకు ఒక రోజు ముందు కొత్త పథకాలు, వరాలు, తాయిలాలను ప్రకటిస్తున్నాయని, ఇది ఓటర్లను ప్రభుత్వ నిధులతో ఆకర్షించడమే అవుతుందన్నారు.