కమ్యూనిస్టులంటే ఏంటో కేసీఆర్ కు చూపిస్తం : కూనంనేని సాంబశివరావు

కమ్యూనిస్టులంటే ఏంటో కేసీఆర్ కు చూపిస్తం : కూనంనేని సాంబశివరావు

వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులంటే ఏంటో చూపిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధం ఏంటో కేసీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య సఖ్యత కుదిరింది కాబట్టే తమను దూరం పెట్టారని చెప్పారు.  బీఆర్ఎస్ తో తమకు సంబంధం తెగిపోయిందన్నారు.  వచ్చే ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉందని.. తాము నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు.  ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు. ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు.

బీజేపీని ఓడించాలనే లక్ష్యంతోనే మునుగోడులో బీఆర్ఎస్ కు మద్దతిచ్చామన్నారు కూనంనేని సాంబశివరావు. తమ మద్దతు కావాలని కేసీఆరే కోరారని చెప్పారు .మునుగోడులో తమ మద్దతుతోనే  బీఆర్ఎస్ గెలిచిందన్నారు.  తాము లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ పరిస్థితి ఏమయ్యేది? కేసీఆర్ ఆలోచించుకోవాలన్నారు.బీజేపీకి దగ్గరయితే కేసీఆర్ మిత్ర ధర్మం పాటించరా? అని ప్రశ్నించారు. పొత్తు చెడిందని  వ్యక్తిగతంగా కేసీఆర్ పై విమర్శలు చేయ్యబోమన్నారు.  పొత్తు చెడిపోయిందని బీఆర్ఎస్ ను మేం తిట్టబోమన్నారు.   కేసీఆర్  బీజేపీ సపోర్టు ఉంటే  చాలనుకుంటున్నాడని..కేసీఆర్ కు తామేంటో చూపిస్తామని సవాల్ విసిరారు.ః

కేసీఆర్ రాజకీయ విధానంతో వచ్చిన సమస్య: తమ్మినేని వీరభద్రం

అభ్యర్థులందరినీ కేసీఆర్ ఏకపక్షంగా ప్రకటించారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీట్ల సర్దుబాట్లదో వచ్చిన సమస్య కాదని.. కేసీఆర్ రాజకీయ విధానంతో వచ్చిన సమస్య అని అన్నారు. రాజకీయ విభేదం ఏంటో కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు.   తాము కోరిన సీట్లలో కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు. తమతో కలిసి వచ్చే వాళ్లతో పోటీచేస్తామని చెప్పారు.