
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
జగదేవ్‌పూర్( కొమురవెల్లి), వెలుగు : నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు అమరులు అయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌లో మాజీ సర్పంచ్ కె.భీమన్న స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ... హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా పాలిస్తున్న నిజాంకు వ్యతిరేకంగా బద్ధం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మాక్ధూమ్ మోహినోద్దీన్, అనభేరి ప్రభాకర్‌రావు వంటి లీడర్లు రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
ప్రజల చేత బందూకులు పట్టించి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు. 4,500 మంది కమ్యూనిస్టుల ప్రాణత్యాగం కారణంగానే తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. కొన్ని పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయని, వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కారణంగానే హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. అమరుల పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, రిటైర్డ్ జడ్జి జయసూర్య, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బట్టు దయానందరెడ్డి, వణేశ్, కొమ్ముల భాస్కర్, కిష్టపురం లక్ష్మణ్, జెర్రిపోతుల జనార్దన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శివలింగ కృష్ణ, స్వర్గం రాజేశం పాల్గొన్నారు.