ఐసీయూలో తమ్మినేని.. కండీషన్ సీరియస్‌గా ఉందన్న డాక్టర్లు

ఐసీయూలో తమ్మినేని.. కండీషన్ సీరియస్‌గా  ఉందన్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు :  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం హెల్త్ కండీషన్ సీరియస్ గానే ఉందని హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో  ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఊపిరితిత్తుల నుంచి నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మంగళవారం ఉదయం తమ్మినేని తన స్వగ్రామమైన ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లిలో ఉండగా  ఛాతిలో నొప్పి వచ్చింది. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను కుటుంబసభ్యులు ఖమ్మం సిటీలోని ఓ ప్రైవేట్​దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ టెస్టులు నిర్వహించి.. డాక్టర్ల సూచన మేరకు వెంటిలేటర్ సాయంతోనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. 

సాయంత్రం  తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. ఆయన గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వివరించారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్​ కుమార్ గైడెన్స్ లో ట్రీట్మెంట్ నడుస్తున్నదని బులిటెన్ లో వివరించారు. హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న తమ్మినేనిని సీపీఎం రాష్ట్ర  కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.​వీరయ్య, జి.నాగయ్య, చుక్కా రాములు, టి.సాగర్, పాలడుగు భాస్కర్ తదితరులు పరామర్శించారు. తమ్మినేనికి రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారని, అందువల్ల కార్యకర్తలు ఆస్పత్రికి రావద్దని  సీపీఎం నేతలు కోరారు. 
 
ప్లీనరీ వాయిదా..

ఈ నెల 17,18 తేదీల్లో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగాల్సిన సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వాయిదా పడ్డాయి. తమ్మినేని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో వాయిదా వేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు.