బీఆర్ఎస్​ సభ్యులకు ఏడాది వరకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు

బీఆర్ఎస్​ సభ్యులకు ఏడాది వరకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు
  •     వాళ్లు చేసిన అప్పులు తీర్చడానికైనా మళ్లీ అప్పులు చేయాల్సిందే : కూనంనేని

హైదరాబాద్, వెలుగు : ఇంకొక సంవత్సరం పాటు కాంగ్రెస్ ​ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏడాది వరకు వారు ఏమీ మాట్లాడొద్దని సూచించారు. అసెంబ్లీలో ఓటాన్​ అకౌంట్​బడ్జెట్​పై చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలే అవుతోందని, వ్యవస్థలను విధ్వంసం చేసి.. ఎలా బాగు చేస్తారో చూస్తాం అని బీఆర్​ఎస్​ సభ్యులు అనడం ఏంటని ఆయన మండిపడ్డారు. 

శాపనార్థాలు పెడితే ఎవరికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం 2.75 లక్షల కోట్లతో వాస్తవిక బడ్జెట్​ను ప్రవేశపెట్టిందని అన్నారు. ‘‘మేడిగడ్డ పర్యటనకు మేమంతా వెళ్లాం. అది చూసి రావడం నేరమా? మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం లేదు. ఇప్పుడు దానికే ప్రమాదం వచ్చింది. ప్రజల పేరు మీద చేసిన అప్పులన్నీ తీసుకెళ్లి కాళేశ్వరం మీద పెట్టారు. దాన్ని ఎలా వాడుకలోకి తీసుకురావాలనే దానిపై సలహాలు, సూచనలు చేయాల్సింది పోయి ఏదోదో మాట్లాడుతున్నారు. 

పర్​ క్యాపిటా ఇన్​కంలో ముందున్నామని అంటున్నారు.. మరి పేదవాళ్లు అలానే ఎందుకున్నారో చెప్పాలి. సమాజానికి సేవ చేయాలనే సంకల్పం, గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి నేర్చుకుంటే అన్నింటినీ అమలు చేయవచ్చు” అని కూనంనేని అన్నారు. మహిళలందరికీ రూ.2,500 ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు, స్థితిమంతుల లెక్కలు తీస్తే అమలు చేయడం పెద్ద విషయం కాదన్నారు.