మిత్ర పక్షమని మౌనంగా ఉంటే చులకనా? : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మిత్ర పక్షమని మౌనంగా ఉంటే చులకనా? : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  •     తిట్టలేం.. విమర్శించలేం!
  •     మంత్రి ఉత్తమ్ శాంక్షన్  చేస్తుంటే ఆర్థిక మంత్రి సంతకం పెట్టరు
  •     అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: ‘మేము మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టే గట్టిగా మాట్లాడలేకపోతున్నామని, మౌనంగా ఉంటే మమ్మల్ని అసమర్థుల్లా చూస్తున్నారని, తిట్టలేం.. విమర్శించలేం అన్నట్లుగా మా పరిస్థితి తయారైంది’ అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన బడ్జెట్​ పద్దులపై మాట్లాడుతూ రాష్ట్ర నిధులన్నీ ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయనే ప్రచారంలో నిజం లేదన్నారు. ‘ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉండొచ్చు.. కానీ మాకు మాత్రం నిధులు రావడం లేదు. రెండున్నరేళ్లుగా ఒక్క పని కూడా కాలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్తే శాంక్షన్  ఆర్డర్  రాస్తారు. 

కానీ, ఆర్థిక శాఖ నుంచి రూపాయి విడుదల కాదు. మంత్రులకు, ఆర్థిక మంత్రికి మధ్య సమన్వయం లేదు. మంత్రులను ఎన్నిసార్లు అడిగినా అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు దొరకవు.. ఫోన్లు ఎత్తరు. మమ్మల్ని ప్రజల ముందు అసమర్థుల్లా చేస్తున్నారు’ అని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది అవుట్ సోర్సింగ్  ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని, వారికోసం ప్రత్యేక కార్పొరేషన్  ఏర్పాటు చేయాలని డిమాండ్  చేశారు. 

అసంఘటితరంగంలో ఉన్న 2 కోట్ల మందికి పీఎఫ్  సౌకర్యం కల్పించాలని, జీవో నంబర్​ 22 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో యూనియన్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని కోరారు.  వైద్య, విద్యారంగాల్లో 70 శాతం ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నాళ్లు చర్చిస్తారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. నిరంతరం ఇదే అజెండాగా పెట్టుకుంటే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం తగ్గుతుందన్నారు.