మతోన్మాదుల అరాచకాలపై పోరాడేది కమ్యూనిస్టులే..సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మతోన్మాదుల అరాచకాలపై  పోరాడేది  కమ్యూనిస్టులే..సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

జూలూరుపాడు/వైరా, వెలుగు : మతోన్మాదుల అరాచకాలపై పోరాడేది  కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించనున్న సీపీఐ శతవసంతాల ముగింపు బహిరంగ సభ సందర్భంగా  గద్వాల నుంచి ప్రారంభమైన బస్సు జాతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు, ఖమ్మం జిల్లా వైరాకు శుక్రవారం చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత దేశంలో మావోయిస్టులు తుపాకీ ద్వారానే రాజ్యాధికారం అన్న తమ పంథాను వీడి ప్రజాస్వామ్య ఉద్యమాలలో కమ్యూనిస్టులతో కలిసి రావాలన్నారు. 

దేశంలో చీలిపోయిన కమ్యూనిస్టులు సైతం ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని మోదీ, అమిత్​ షా  దోచుకుంటున్నారని,  దేశంలో మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బాల నరసింహ,  సీపీఐ  జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి తండ్రి సురేశ్, సీపీఐ వైరా ఇన్​చార్జ్  ఎర్ర బాబు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చంద్ర నరేందర్, సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.