జూబ్లీహిల్స్ మైనర్​ కేసులో సీపీ చెప్పినవి అబద్దాలె

జూబ్లీహిల్స్ మైనర్​ కేసులో సీపీ చెప్పినవి అబద్దాలె
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ 

హైదరాబాద్,వెలుగు: జూబ్లీహిల్స్ మైనర్ కేసు విషయంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అబద్ధాలు చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రభుత్వమే ఆయనతో అలా చెప్పించిందని ఆరోపించారు. బుధవారం మగ్ధూంభవన్​లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి నారాయణ మాట్లాడారు. టీఆర్​ఎస్ తన మిత్రపక్షమైన ఎంఐఎం, ఇతర పార్టీల నేతల పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పబ్ మూసివేసి.. దాని యజమానిని అరెస్ట్ చేయాలని కోరారు. లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. నిరసనలు చేయకుండా ప్రతిపక్ష లీడర్లను ఇంటి వద్ద పొద్దున్నే కట్టడి చేసే పోలీసులకు.. మైనర్ కేసులో నిందితులను కనిపెట్టడానికి మాత్రం వారం పట్టిందని నారాయణ ఎద్దేవా చేశారు. సీవీ ఆనంద్ మంచి వ్యక్తి అని..  కానీ ఆయన కూడా ఒత్తిళ్లకు లొంగి  మాట్లాడారని తెలిపారు. పబ్​లపై  పోలీసుల, రాష్ట్ర ప్రభుత్వ నిఘా లోపించిందని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. నగరం డ్రగ్స్ మాఫియాకు అడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.