కేసీఆర్ ను బస్సు టైర్ల కింద నలిపేస్తరు : నారాయణ

కేసీఆర్ ను బస్సు టైర్ల కింద నలిపేస్తరు : నారాయణ

కార్మికుల శవాలపై నడవాలని చూస్తే జాగ్రత్త.. కేసీఆర్​కు నారాయణ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీ కార్మికుల శవాలపై నడవాలని కేసీఆర్​ చూస్తున్నారని, కానీ ఆయనను ఆర్టీసీ కార్మికులు బస్సు టైర్ల కింద నలిపేస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి బస్సులను నడపాలని చూస్తే కార్మికులు ఊరుకోరని, వాటిని అగ్నికి ఆహూతి చేస్తారని అన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి సంతాపసభ, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.  నారాయణతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అడ్వకేట్​ రచనారెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఆర్టీసీ నేతలు థామస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నారాయణ మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమం ముందు నిజాం నవాబే తలవంచక తప్పలేదని, కేసీఆర్​ ఎంత అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేశారని, జగన్​ను చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చాక ఓయూను పాకిస్థాన్​లా చూస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవోలు మద్దతు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే భవిష్యత్తులో టీఎన్జీవోలకు కష్టం వస్తే మద్దతు ఎవరూ ఇవ్వరని హెచ్చరించారు.

కేసీఆర్​ మ్యాచ్​ ఫిక్సింగ్: తమ్మినేని

ఆర్టీసీ సమ్మెకు ముందే ప్రైవేటు వాళ్లతో కేసీఆర్​ మ్యాచ్​ ఫిక్సింగ్​ చేశారని, అందువల్లే ఆర్టీసీ విలీనం విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఆర్టీసీ కార్మికులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. డిస్మిస్​ అంటే లీగల్​గా ఇరుక్కుంటారనే భయంతో సెల్ఫ్​ డిస్మిస్​ అనే పదాన్ని కేసీఆర్​ వాడారని ఎద్దేవా చేశారు. ఎవరబ్బ సొమ్మని ఆర్టీసీని 50 శాతం ప్రైవేటీకరిస్తారని మండిపడ్డారు.

కేసీఆర్‌.. జాగ్రత్త: రచనారెడ్డి

సీఎం కేసీఆర్​ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ఎక్కువ రోజుల ఉండలేరని అడ్వకేట్ రచనారెడ్డి అన్నారు. సెల్ఫ్​ డిస్మిస్​ అనే పదం ఆక్స్​ఫర్డ్​ డిక్షనరీలో కూడా లేదని ఎద్దేవా చేశారు.