- మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్
మహబూబాబాద్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్తెలిపారు. గురువారం కేసముద్రం మండలంలో నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్త్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి పొందిన అభ్యర్థులు, వారి సహాయకులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. జిల్లా సరిహద్దుల్లో, ప్రధాన రోడ్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నగదు, విలువైన వస్తువులు తీసుకువెళ్లే క్రమంలో సంబంధిత రసీదు తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగే గూడురు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల పరిధిలో 211 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్‌గా గుర్తించామని, వాటి వద్ద అడిషనల్ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కామెంట్‌లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతి పొందిన వాహనాలే వినియోగించాలని, లౌడ్‌స్పీకర్ వాడకానికి ముందస్తు అనుమతి పొందాలన్నారు. ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.
