
- రైతులు నిరసన చేస్తుంటే ఫొటోలకు పోజులివ్వడమేంటి?: నారాయణ
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఫొటోలకు ప్రధాని మోదీ పోజులు ఇస్తున్నారని, ఆయన అందాల పోటీల్లో పాల్గొంటే నంబర్ వన్‌గా నిలుస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరస్తులు విదేశాల్లో హాయిగా ఉన్నారని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలు మాత్రం రోడ్డుపై ఆందోళనలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు టెర్రరిస్టులు, దేశ ద్రోహులు కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రైతులకు మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పాత్ర, పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. తర్వాత నారాయణ మీడియాతో మాట్లాడారు.
‘‘యువ రైతును కాల్చేశారు. ఇది మోదీ సర్కారు హత్యే. లోక్‌సభ ఎన్నికల్లోనూ సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మేము ఐదు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా సీపీఐ 30 చోట్ల పోటీ చేయనుంది’’అని తెలిపారు. అనంతరం అజీజ్ పాషా, కూనంనేని సాంబశివ రావు మాట్లాడారు. ఈ నెల 26న రైతులకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నారు.