టీఆర్ఎస్ నేతలు గూండాల్లాగా వ్యవహరిస్తే.. వారికి పోలీసులు సహకరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఆందోళనల సందర్భంగా గాయపడి భూ నిర్వాసితులు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను ఇవాళ సీపీఐ నారాయణ పరామర్శించారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కమిటీ తాత్కాలిక కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, స్థానిక సీపీఐ నేతలు ఉన్నారు. గాయపడిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. బాధితులు కన్నీళ్లు పెట్టుకొని సీపీఐ నారాయణతో వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితుల ఓదారుస్తూ.. వారి కన్నీళ్లను పార్టీ కండువాతో తుడిచారు నారాయణ.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు భూ నిర్వాసితులపై రోకలిబండలతో గొడ్డును బాదినట్లు బాదారన్నారు. ఖాళీ చేతులతో వచ్చిన నిర్వాసితులపై పోలీసుల దాడి చేయడం హేయనీయం అని నారాయణ అవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వాళ్లకు అక్కడ ఏం పని.. వాళ్లు అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అక్కడ కట్టింది ప్రభుత్వ రిజర్వాయరా? టీఆర్ఎస్ పార్టీ కట్టించిన రిజర్వాయరా? అని నారాయణ నిలదీశారు. టీఆర్ఎస్ నేతలు గూండాల్లాగా వ్యవహరిస్తే.. వారికి పోలీసులు సహకరించారని ఆరోపించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కట్టిస్తానన్న కేసీఆర్.. దాడులు చేయిస్తారా?.. నిర్వాసితులు కేసీఆర్ అబ్బ సొత్తు ఏమీ అడగడం లేదు.. వాళ్లు కోల్పోయిన భూమికి పరిహారం మాత్రమే అడుగుతున్నారని నారాయణ మండిపడ్డారు.
ప్రాజెక్టులు సాగునీటి కోసం కట్టాలని మేము కోరుకుంటుంటే... కేవలం ప్రాజెక్టును కమిషన్ల కోసమే కట్టాలని టీఆర్ఎస్ అనుకుంటోందని అన్నారు. నిర్వాసితుల సమస్యలను విని వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి.. వారిపై దాడి చేశారన్నారు. జాతీయ రాజకీయాల్లోకి పోతానని చెబుతున్న కేసీఆర్.. తన రాష్ట్రంలోనే నిర్వాసితులపై దాడులు చేస్తారా? అని నారాయణ ప్రశ్నించారు. కేసీఆర్ పాలన ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్లుగా ఉందన్నారు.భూ నిర్వాసితుల రక్తసిక్త హస్తాలతో కేసీఆర్ ఢిల్లీకి పోతారా? అని అడిగారు. లాఠీఛార్జీకి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి.. నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలి. తానే స్వయంగా వచ్చి కుర్చీ వేసుకుని కుర్చొని సమస్య పరిష్కరించాలి. గౌరవెల్లి ఘటనకు నిరసనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని నారాయణ వెల్లడించారు.
