
- ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ను రేవంత్ ఫాలో కావద్దు
- రౌడీలు చట్టసభల్లోకి వెళ్తున్నరు
- మోడీ హయాంలో రైతులకు అన్యాయం
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
భద్రాద్రి కొత్తగూడెం: రాజకీయాల్లో గర్వం, అవినీతి, నియంతృత్వం ఉన్నవాళ్లు ఎప్పటికీ బాగుపడరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ చుంచుపల్లి మండలంలో రజబ్ అలీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డి కి పట్టనుందా అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం లేకుండా చేద్దామనుకున్న కేసీఆర్, జగన్ లకు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టనుందన్నారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్ , రేవంత్ రెడ్డి అందరూ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు.
బంగ్లాదేశ్ లో ప్రతిపక్షం లేకుండా చేసిన ప్రధానమంత్రి షేక్ హసీనాను ప్రజలు దేశం నుంచి తరిమికొట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ ను ఏపీ ప్రజలు పక్కన పెట్టారన్నారు. అధికార మదంతో వ్యవహరించిన కేసీఆర్ నూ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రౌడీలు చట్టసభల్లో వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కాకుల మధ్య కోకిల లా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతున్నారని ప్రశంసించారు. కార్పొరేట్ వ్యవస్థకు మోడీ లబ్ధి చేకూరుస్తున్నాడని, రైతులకు మాత్రం న్యాయం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. మోడీ అన్ని ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీన పడిందన్నారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌ల సహకారంతో బ్లాక్ రాజకీయాలతో మూడోసారి పీఎం అయ్యాడని ఆయన విమర్శించారు.