అందుకే మునుగోడులో మమ్మల్ని కలుపుకున్నడు: నారాయణ

 అందుకే మునుగోడులో మమ్మల్ని కలుపుకున్నడు: నారాయణ

హైదరాబాద్,వెలుగు: రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ చాలా తెలివైనవాడని, అందుకే మునుగోడులో కమ్యూనిస్టులను కలుపుకున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కానీ కొందరు గిట్టనోళ్లు లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్​ కు అమ్ముడుపోయాయని, నేతలు ప్యాకేజీలు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లో సీపీఐ స్టేట్ ఆఫీసులో మాట్లాడారు. కేసీఆర్​కు వ్యతిరేకంగా పోరాటం చేసినా పోలీసులు ఎప్పుడూ పార్టీ ఆఫీసులోకి రాలేదని, మోడీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే మాత్రం ఆఫీసులోకి వచ్చారని చెప్పారు. తెలంగాణ పోలీసులను కేసీఆర్.. మోడీకి అప్పగించారా? అనే అనుమానం వస్తోందన్నారు.

మునుగోడులో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందకుండా ఉండేందుకే మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారని చెప్పారు. కాంట్రాక్ట్, ప్రైవేటైజేషన్ విధానాలతో సింగరేణి సంస్థను బతికి ఉండగానే చంపేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘మైన్స్ మినరల్స్ డెవలప్ రెగ్యులేషన్ చట్టాన్ని 2015లో సవరించి, కమర్షియల్ మైనింగ్ అనుమతినిచ్చారు. ఇప్పటికే 240 మైన్స్ ప్రైవేటుకు ఇవ్వాలని గుర్తించారు. వాటిలో 98 మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. ఇందులో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నరు” అని పేర్కొన్నారు.